పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/308

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చతుర్ధాశ్వాసము

101

“నలిభక్తతతివలువలుదుకుచాకి - విలసితభక్తియు నిలఁజెప్పఁబడియె
నదిగాక యేకాకియన్మడివాలు - సదమలభక్తి భాషయు నొప్పెఁ గాని
యిట్టి సద్భక్తియు నిట్టి మహత్త్వ - మిట్టి [1]సామర్ధ్యంబు నెఱుఁగ మే”మనుచు
సల్లీల ననిశంబు సంస్తుతు ల్సేయఁ - దెల్లగానటు గొన్ని దినములు సనఁగ
బఱతెంచుచో [2]ముట్టుపాటైన నొకని - నఱిముఱిఁ జంపి మాచయ్య యున్నెడను

మాచయ్య తెరువరిని జంపెనని పౌరులు బల్లహునకుఁ జెప్పుట


వీరువారన కెల్లవారునుగూడి - ధారుణీశ్వరు సభాస్థలికేఁగి మ్రొక్కి
“బల్లహ! వినుము నీ పట్టణంబునను - బ్రల్లదుండొక చాకి బత్తుండననుచు
మొలఁగఠారముగట్టి తొలఁగండు ద్రోవ - తొలఁగించు నే బల్లిదులఁబిఱుసనఁడు
చాటుఁ "జీరలమూట సంధిల్లిరేని - పోటు ముందఱ” [3]ననిపోటులమాట
నంగళ్లు నిలిపె బేహారముల్మాన్చె - సంగడి నిటయట సరియింపరాదు
పురవీథి నెవ్వరేఁ బోయినఁ జూచి - పరిగొన [4]కనుకనిఁబాఱంగం దోలు
[5]నెదురను బసి గుఱ్ఱ మేనుంగు బండి - యదియేమి సోద్దెమో కదియంగ వెఱుచు
నల్లంతఁబొడగని [6]చల్లన నవసి - కల్ల వెల్లైపాఱుఁగథలేల? నేఁడు
వింత వాఁడొకఁడు మున్వినమిఁగాఁజేసి - సంతకుఁ బోవుచో సంధిల్లినంతఁ
బొడిచి మీఁదికిఁజిమ్మెఁబొందియు నచటఁ - బొడలేదు మ్రింగెనో పోయెనో దివికి
నటగార్యమెఱుఁగమే[7]మవనీశ! వినుము - ఇట వచ్చితిమి నీకు నెఱిఁగింప”ననిన
బసవనిదెసఁ జూచి పార్థివేశ్వరుఁడు - కసిమసంగుచు మహోగ్ర[8]త నిట్టులనియె
“ఇది యేమివిపరీతమింక నెవ్వరికి - బ్రదుకంగవచ్చు నీ భక్తులచేతఁ
గోకలుదుకు చాకి గ్రొవ్వి యిప్పురము - [9]లోకంబునెల్ల గల్లోలమార్చెడిని
జాకికి [10]నింతేల స్రడ్డలు జనులఁ - జేకొన కడిచెడుఁ జేరంగనీక
యిట్టిచోద్యంబు లేమెఱుఁగ [11]మేనాఁట - ముట్టినఁ జీరలు ముఱుగునే చెపుమ
పురజనులకు మున్నె చరియింపరాదు - పరదేశికింక రాఁబాసె మా పురికి
నెంతబల్లిదుఁడొ నేఁడ్వింతవాఁడొకఁడు - సంత కేఁగఁగఁజంపె శవమును లేదు

  1. చోద్యముగాన మెన్నఁడు ననుచు
  2. ముట్టి
  3. యను
  4. కినుకమైఁ
  5. నెదుటను
  6. యార్చినఁ జూచి
  7. మవనీశ్వరుండ!
  8. మున నిట్లనియె
  9. లోకుల
  10. నింతేసి స్ర(న)డ్డలే, జనులఁ
  11. మెన్నఁడును