పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/285

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

78

బసవపురాణము

'హో'యని డమరుగంబొగినొక్కమాటు-వాయింపఁదడవసర్వములయ[1]బొందుఁ (ద)?
జరణంబు దొంగలి చలనగాఁ జేసి - పరగంగ నక్షత్రపంక్తులు డుల్ల;
వినుతమహోద్రేకవీక్షణాటోప - మున నజాచ్యుతదేవముఖ్యులడంగ
మూవలగంటల మ్రోఁతకు వెఱచి - దేవి యున్న సగంబు ధృతిఁదన్నుఁగలయ
ఖ్యాత మహోద్ధత కరతాడనముల - నాతతదిక్తతి [2]యవలఁజనంగ
వడి మహోచ్ఛ్వాసనిశ్శ్వాసోపనిహతి - బడబాలనం బాఱ జడనిధు లింక
గతిని మెట్టెడుపాదఘట్టనచేత - నతులధాత్రీతలంబది ధూళి గాఁగ
నురవడిమై జిఱ్ఱఁదిరిగి నిల్చుడును - బొర[3]మాలి దిగ్గజంబులు వొడవడఁగ
[4]గ్రక్కున జాఱి టంకారంబుచేత - నెక్కొన్న కులగిరుల్ నెఱిఁబొడిగాఁగ
నొందంగఁ బాదాగ్ర మూఁది నటింపఁ - - గ్రిందటికూర్మంబు [5]గిజగిజగాఁగ
మహితజటాచ్ఛటా విహతి నజాండ - బహులకటాహంబు వఱియలుగాఁగ
నురుకిరీటవిఘాతనోద్వృత్తిఁజేసి - పొరిఁదత్త్వ సందోహములు వెల్లగిలఁగఁ
దాండవోద్ధతిఁజేసి ధరియింపఁబడిన - దండిఫణీంద్రుండు దలరి రోఁజంగ
నిటురోఁజుచున్న ఫణీంద్రు నూర్పులకు - స్ఫుటఫాలనేత్రాగ్ని భుగులన నెగయ
వడి నెగసెడినేత్రవహ్నిరోచులకు - జడలపైఁ జంద్రుఁడాసగమును గరఁగఁ
గలయ సుధాసూతి గరఁగినకతన - బలువిడి నమృతంబు దల డిగి పఱవఁ
దలడిగి పఱతెంచు తత్సుధాపూర - మలరి ముంచుడు జీవములు వచ్చి యంత
నురమున శిరమున నొగి గళంబునను - గరముల భూషణోత్కరములై వెలిఁగి
పరగుసురాసుబ్రహ్మాచ్యుతాది - వరకపాలావళుల్ శరణు వేఁడుచును
బొబ్బలు వొడువంగఁ బొంగి యార్వంగ - నుబ్బి యాళతిసేయ నొగిఁ దాళగింప
గ్రీడ వట్రిల జతిగీతముల్ వాడ - నాడుదుఁ బ్రమథులు సూడఁదాండవము
కావునఁ దాండవాకార మత్యర్థి - భావించి కొలుతురు[6]భక్తు లెప్పుడును”
ననుచు నానతియిచ్చి యద్దేవదేవుఁ - డనురాగలీలమై నతుల మౌగ్థ్యమున
మించిన నాట్య నమిత్తండి మహిమ - నంచితకనక దివ్యవిమానమునను
గొనిపోయెఁ గైలాసమునకు సద్భక్త - [7]జనులు సజ్జనులును వినుతింప” మఱియు:

ఉడుమూరి కన్నప్ప కథ


"శ్రీకాళహస్తిగిరి ప్రదేశమున - శ్రీకంఠభక్తుండు లోకైకసుతుఁడు
ఉడుమూరి కన్నప్పఁ డొక్కనాఁడర్థి - నడవికి వేఁటమై నరిగి యొక్కెడను

  1. మౌను
  2. యౌలనణంగ
  3. ఁబొరి
  4. టక్కున.... కటారంబు
  5. గిజగిజ
  6. భక్తులు భువిని
  7. జనులును మునులును