పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/270

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తృతీయాశ్వాసము

63

సడిసన్న శివభక్తి సౌభాగ్యమహిమ - లొడఁగూడునే వెండి యొండుమార్గమున
నాకును నీ కారణమునఁ గాఁజేసి - చేకూరెనిట్టి లంజెఱిక మీ రాత్రి
బండారి! నీయాన [1]పసిబిడ్డనాఁట - నుండియు శ్రీగిరి నుండుదునచట
ననుపమకదళీవనాంతరబిల్వ - వనముల నేకాంతవాసంబునందుఁ
బన్నుగా నఱకాలఁగన్నును నొసలఁ - గన్నును గలమహాగణములు గలరు
చూతుము గాని యెచ్చోట మున్నిట్టి - భూతిశాసనధారిఁ బొడగాన మేము
పొలుపగు పచ్చవిభూతిపూఁతయును - దెలుపగు రుద్రాక్షములు నెఱ్ఱజడలు
నంతకుఁదగిన సర్వాంగకచ్చడము - వింతయై యున్నది యింతి [2]వేషంబు
నిట్టిలాంఛనదారి నిట్టివిరాగి - నిట్టి [3]నిష్ఠాశాలి నేమనవచ్చు?
ఇంతి నొక్కతెఁజెప్పనేల తత్సతికి - సంతతంబును బరిచర్యలు సేయు
లలనలందఱు నట్టిలాంఛనధరులు - చెలువలమహి[4]మంబు శివుఁడె యెఱుఁగు”
ననుచుఁ దత్సతుల లాంఛనములు నచటి - తన మిండతనమును దప్పకచెప్పఁ
బలుమాఱు నడుగుచు నలి జంగమములు - సెలఁగుచు నొండొరుఁ [5]జేవ్రేసి నవ్వ
బసవం డసమసముల్లసనుఁడై చెన్న - బసవని దెసఁజూచి పసరింపఁదొడఁగె
"ఇట్టి నెట్టణభక్తి యిట్టి ముగ్ధత్వ - మిట్టిమహత్త్వంబు నెందును గలదె?
నిక్క మీశ్వరుఁగాని నిజ మెఱుంగమిని - ముక్కంటి భక్తులు ముగ్ధలు గారె?”
అని ప్రశంసింపంగ నా చెన్నబసవఁ - డనురక్తి ముకుళితహస్తుఁడై మ్రొక్కి
“పరగు నీ నూతన ప్రాక్తనభక్త - వరగణంబులలోన వచియింపఁజూప
నిల నిట్టి ముగ్ధలు గలరొకో?” యనుచు - నలి దీటుకొనఁగ విన్నపము సేయుడును
బరమానురాగసంపదఁ దేలి సోలి - కరమర్థి మఱి ముగ్ధగణముల కథలు
పసరింపఁ దలఁచి సద్భక్తి బండారి - బసవయ్య యా చెన్నబసవనికనియె

రుద్రపశుపతి కథ


వ్యక్తంబెఱుంగవే యయ్యళయూర - భక్తుండు మును రుద్రపశుపతి నాఁగఁ
ప్రథితమౌ నాదిపురాణమందబ్ధి - మథనావసర మొక్కకథికుండు సదువఁ
గమలజ కమలాక్షు లమితదైత్యాదు - లమరులు సెడి పాఱ నందుద్భవించి
పొరి నజాండములెల్ల దరికొని కాల్చు - గరళంబు మ్రింగె శ్రీకఱకంఠుఁడనిన
నా రుద్రపశుపతి యాలించి భర్గుఁ - డారగించుట నిక్కమా విషం? బనుడు

  1. పసు
  2. రూపంబు
  3. నిష్క్రియురాలి; నిస్స్పృహశాలి
  4. దా
  5. రుల్ చేయివ్రేసి