పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/245

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

38

బసవపురాణము

నల్లవో! బసవ! యనశ్వరకీర్తి! - నల్లవో! బసవన్న! నందీశమూర్తి!
అమృతంబునందు దివ్యంబగుచేగ - విమలమాణిక్యగర్భమున దీపంబు
చెఱకునఁ బండు పసిఁడిఁగమ్మఁదనము - గొఱయైన మలయజ కుజమునబూవు
చిత్తరువునకును జీవంబుఁ బసిఁడి - పుత్తళికిని బ్రాణమును నిక్కువముగఁ
బుట్టినయట్టు[1]గాఁ బుట్టితి కొడుక! - నెట్టణ భక్తికి నిలుకడ యగుచు
నాదుబసవ! దండనాయకబసవ! - యాదిబసవ! యసంఖ్యాతులబసవ!
భక్తులబసవ! యా ప్రమథులబసవ! - ముక్తీశుబసవ! నా ముద్దులబసవ!
సంగన బసవ! ప్రసాదంబు బసవ! - జంగమంబు బసవ! సత్యంబు బసవ!
పండితబసవ! సత్పాత్రంబు బసవ! - బండారిబసవ! సౌభాగ్యంబు బసవ!
తత్త్వంబు బసవ! మహత్త్వంబు బసవ! - సత్యంబు బసవ! నిత్యత్వంబు బసవ!
[2]వృషభంబు బసవ! సంవిజ్జ్యోతి బసవ! - విషకంఠు బసవ! వివేకంబు బసవ!
తజ్‌జ్ఞులబసవ! తత్త్వజ్ఞులబసవ! - ప్రాజ్ఞులబసవ! సర్వజ్ఞులబసవ!
సిద్ధులబసవ! ప్రసిద్ధులబసవ! - శుద్ధులబసవ! ప్రబుద్ధులబసవ!
బసవయ్య! బసవన్న! బసవకుమార - బసవ! బసవరాజ! బసవలింగంబ
వడిఁ బాఱుజలమున కొడలెల్లఁగాళ్లు - వడిఁ గాలుచిచ్చున కొడలెల్ల నోళ్లు
వడి వీచుగాడ్పున కొడలెల్లఁదలలు - వడిఁ జేయు [3]బసవన కొడలెల్ల భక్తి
'బసవా' యనఁగ విన్నఁ [4]బానలొండేల? - పసులకునైనను ప్రబలదే భక్తి?
“బసవా” యనఁగ విన్నఁ [5]బానలొండేల? - [6]పసిబా[7]లురకునైన నెసఁగదే భక్తి?
“బసవా” యనఁగ విన్నఁ బానలొండేల? - యసమాక్షునకునైన నలరదే భక్తి?
“బసవా” యనెడి భక్తిపరులఁ జూచినను - [8]నెసఁగుపక్షులకైన నింపదే భక్తి?
“బసవా” యనెడు భక్తిపరులచేరువను - మసలు జంతువులకు నెసఁగదే భక్తి?
“బసవా” యనినఁ జాలుఁ [9]బానలొండేల? - ననలార విషమైన నమృతంబు గాదె?
“బసవా” యనినఁ జాలుఁ [10]బానలొండేల - పసిగ మైఁగులిశంబు గుసుమంబు గాదె?
“బసవా” యనినఁ జాలుఁ [11]బానలొండేల? - వసుధ శత్రులు మిత్రవర్గంబు గాదె?
“బసవా” యనినఁ జాలుఁ [12]బానలొండేల? - వెసఁగాలు కార్చిచ్చు వెన్నెల గాదె?
లింగైక్యసౌఖ్యకేళీలోల [13]భక్తి - జంగమప్రాణాను[14]సంధానశక్తి

  1. మున్పుట్టితి
  2. “సౌందర్య(ము)బసవ? సాధ్యులబసవ! నందీశు బసవ! యానందంబు బసవ!” కొన్ని ప్రతులయందుఁగలదు
  3. బసవ! నీ
  4. బాస
  5. బాస
  6. పసు
  7. బాలులకు
  8. నెసఁగఁ బక్షుల
  9. బాస
  10. బాస
  11. బాస
  12. బాస
  13. యుక్తి
  14. సంధానుషక్తి