పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/243

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

36

బసవపురాణము

“నమిత పరంజ్యోతి రాకారదివ్య - విమలాంగ! శ్రీ గురవే నమో” యనుచు
“స్థిరతరసృష్టిస్థితిలయప్రపంచ - విరహిత! శ్రీగురవే నమో” యనుచు
“సకళ నిష్కళ చరాచరరూపవిగత - [1]వికృతాంగ! శ్రీ గురవేనమో” యనుచు
“నాద్యంతరహితనిత్యామలతేజ! - విద్యాత్మ! శ్రీగురవే నమో” యనుచు
“నధ్వషట్కాతీత! యతిపాతకౌఘ - విధ్వంస! శ్రీగురవే నమో” యనుచు
“మోక్షా[2]ర్థిరక్షణదక్షకటాక్ష - వీక్షణ! శ్రీగురవే నమో” యనుచు
“నజ్ఞానతిమిరసంహారార్థ[3]దత్త - విజ్ఞాన!శ్రీ గురవే నమో” యనుచు
“ధన్యాత్మశిష్యమస్తకకృపాహస్త - విన్యాస! శ్రీ గురవే నమో” యనుచు
“నఘహరణార్థశిష్యజనోపభుక్త - విఘనస! శ్రీగురవే నమో” యనుచు
“నశ్రాంతభక్త జనాత్మాంబుజాత - విశ్రాంత! శ్రీగురవే నమో” యనుచు
“ననఘ గురుప్రసాదామృతహృదయ - వినివాస ! శ్రీగురవే నమో” యనుచు
భ్రాజిల్ల నా చెన్నబసవఁ డబ్బసవ - రాజును దనగురుఁ బ్రస్తుతి సేయ

అల్లమప్రభుని రాక


నంత నల్లమప్రభువను సంయమీశుఁ - డంతకాంతకమూర్తి యతులితకీర్తి
నిర్మూలితోద్రిక్తదుర్మలుఁ డుభయ - కర్మనికృంతనకర్మకర్మఠుఁడు
వైరాగ్యసంసారవర్జితాత్మకుఁడు - దూరదృష్టాదృష్టచారుచర్యుండు
దానప్రతిగ్రహహీనవర్తనుఁడు - మానావమానసమానకీర్తనుఁడు
సమలోష్టకాంచన సమసుఖదుఃఖ - సమమిత్ర శాత్రవ సద్భావనుండు
సప్తధాతుమదాదిసర్వాంగగుణవి - లుప్తచిత్తుండు సంసుప్తిదూరుండు
కాలసంకల్పవికల్ప మహేంద్ర - జాలప్రపంచనిర్మూలనశాలి
పరమశివానందపరవశీభూతుఁ - డురుముక్తకేశయుతోత్తమాంగుండు
దివ్యానిమిషసుధాదృష్టి[4]గోచరుఁడు - భవ్యుండు గాంధర్వపండితోత్తముడు
ఆంతరయాగనిరంతరయోగ - వంతుఁ డనంతవేదాంతవేద్యుండు
నిశ్శరీరి శరీరి నిర్నామి నామి - నిశ్శబ్ది శబ్ది వినిర్భావి భావి
ద్వైతయోగక్రియాద్వైతయోగక్రి - యాతీతయోగక్రియాన్వీతుఁ డనఁగ
ముల్లోకములఁ దేటతెల్లయై భక్తి - కెల్లయై స్వేచ్ఛావిహీనకృత్యమున

  1. వికలాంగ
  2. ర్థ
  3. తత్త్వ
  4. భాసనుఁడు