పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/242

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ద్వితీయాశ్వాసము

35

లింగాభిమాని యభంగురజ్ఞాని - సాంగత్యసువిధాని సతతావధాని
పరమానురాగి సద్భక్తిసంభోగి - విరసభవత్యాగి విమలాత్మయోగి
సత్యసల్లాపి ప్రసన్నస్వరూపి - నిత్యప్రతాపి వినిర్గతపాపి
యీశ్వరమూర్తి యతీంద్రియవర్తి - శాశ్వతకీర్తి ప్రసాదప్రపూర్తి
యనఁగ నిట్లొప్పారి యతులితమహిమ - ననుదినవర్ధమానాంగుఁడై [1]యుండ
“బసవని శ్రీపాదబిసరుహంబులకు - నసలార నిత్యంబు నర్చ లిచ్చుచును
మించినభక్తిమై మేనరోమాంచ - కంచుకం బధికసమంచితంబుగను
గద్గదకంఠుఁడై కనుఁగవ సుఖస - ముద్గతాశ్రువు లొల్క నుత్సుకలీల
సప్రాణలింగలింగప్రాణమథన - సుప్రసన్నానుభవప్రాప్తిఁ బొంది
నలిగొనమర్కటన్యాయంబునందు - ఫలమునఁ బొంది సోపానంబులు డిగి
వెసఁ బొందఁగలుగువాయసఫలన్యాయ - మసలారఁగాఁ జరితార్థతఁ [2]బొంది
గురుభక్తి[3]ఫలసారగుహ్యప్రసాద - వరసేవనాసుఖపరవశలీలఁ
గమనీయ మొంద లింగంబు ప్రాణంబు - రమణఁ బ్రసాదపూరంబు దేహంబు
దిరమగు శుద్ధభక్తియు మానసంబు - హరగణానుభవసౌఖ్యంబు ధనంబు
నిటు గూడ నన్నియు నేకమై కాదె - పటుతరంబుగఁ జెన్నబసవఁడై [4]పేర్చె
భవ్యలింగమున కేర్పడఁ బ్రాణమగుచు - నవ్యప్రసాదంబునకు రుచి యగుచు
జంగమభక్తి కాశ్రయపదం బగుచు - మంగళప్రాప్తికి మందిరం బగుచు
గుఱిగాక వాజ్మనోగోచరం బగుచు - వఱలెడు శివతత్త్వ[5]వల్లభు మహిమ
బిలిబిలి తలఁపులవలన వర్తిల్లి - మొలచిన తమతమ కొలఁది మాటలను
వినుతించుటెల్లను వెలితియ కాదె - పనుగొన నా చెన్నబసవన్న నెలవు
కావున బసవండె గణుతింప నెఱుఁగు - భావింప నా చెన్న బసవన్న మహిమ
బసవనిమహిమయు భాతిగాఁ జెన్న - బసవండె యెఱుఁగు బెంపెసఁగఁ గీర్తింప”
నంచు భక్తానీక మచ్చెరువంద - నంచితభక్తిసమగ్రత మెఱసి

చెన్నబసవన బసవేశ్వరుని స్తుతించుట


“శాశ్వత! సర్వజ్ఞ! శశ్వద్గుణాంక! - విశ్వేశ శ్రీ గురవే నమో” యనుచు
“సద్యఃప్రసన్నానవద్యవేదాంత - వేద్యాత్త! శ్రీ గురవే నమో” యనుచు
“దత్తకైవల్య! యుదాత్తసద్భక్తి - విత్తేశ! శ్రీ గురవే నమో” యనుచు

  1. యంత
  2. బొదలి
  3. సాకార
  4. పేర్చి
  5. వాల్లభ్య