పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/24

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

xvii

శివలింగస్వరూపుఁడైన సాధకుఁడు శివలింగస్వరూపులైన జంగమభక్తుల తీర్థప్రసాదములను గైకొని ప్రకృతికల్పితములైన భేదావరణములను విడిచి గురులింగైక్యమును బొందుచున్నాఁడు.

సకలమతములకును లక్ష్యము జంగమసేవ. ప్రాణహింస చేయక ప్రాణులకు సంతోషమును గలుగఁజేయుటయే ఈశ్వరపూజాఫలమని మతములన్నియును జాటుచున్నవి. బసవేశ్వరుఁడు లింగధారులైన భక్తులను జాతిమతభేదములను విసర్జించి పూజించి, మానవసోదరత్వమును జంగమరూపమునను స్థాపించినవిధమును బసవచరిత్ర రమ్యముగను బోధించుచున్నది.

సాధన

సాధనకును దుఃఖనివృత్తిని, సుఖప్రాప్తిని గలుగఁజేయుటకు శివాత్మకమైన విశ్వమంతయును సంసిద్ధముగ నున్నది. దేశకాలపాత్రల సంస్కారముల కనురూపముగ బహువిధములైన సాధనములను మహానుభావులు కల్పించి సాధకులకుఁ దరణోపాయము విశదము చేయుచున్నారు. వైదిక, బౌద్ధ, జైన, శైవ, వైష్ణవ, శాక్తేయాది భారతీయ మతములను, యూధ, క్రైస్తవ, మహమ్మదీయాది మతములును షడ్దర్శనములను, కర్మజ్ఞాన భక్తి హఠ సన్న్యాసాదియోగములును కైవల్యప్రాప్తికి సాధనంబులుగ నున్నవి. సాధకునకు సకలసాధనములును ధర్మక్షేత్రమైన శరీరమునందుఁ బ్రత్యక్షముగ నున్నవి. దేహేంద్రియవశీకరణము సాధనలకు మూలము. సాధకుఁడు జీవయాత్రయందు దేహేంద్రియాదిసాధనలను దేహయాత్రకు వినియోగించిన దుఃఖమును, ఆత్మయాత్రకు వినియోగించిన సుఖమును గలుగుచున్నవి. శ్రీకృష్ణుఁడు భగవద్గీతయందు జీవయాత్రను ఆత్మయాత్రను జేయఁగలవిధమును జక్కఁగా బోధించెను.

శ్లో. యజ్ఞార్థాత్కర్మణో౽ న్యత్ర లోకో౽యం కర్మబన్దనః।
    తదర్థం కర్మ కౌంతేయ, ముక్తసఙ్గ స్సమాచర॥
    యజ్ఞశిష్టాశిన స్సంతో ముచ్యన్తే సర్వకిల్బిషైః।
    తే త్వఘం భుఞ్జతే పాపాః యే పచన్త్యాత్మకారణాత్॥

-భగవద్గీత, అ. 3-9, 13.