పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/239

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

32

బసవపురాణము

హరగణపరతంత్రుఁడై యుండు బాస - హరభక్తు లెట్లన్న నట్లను బాస
జంగమంబును బ్రాణలింగ మన్బాస - వెంగలిమనుజుల వేఁడని బాస
భవికి మ్రొక్కనిబాస భవి కీనిబాస - భవబాధలకు నగపడకుండు బాస
విషయేంద్రియములకు వెన్నీని బాస - విషమషడ్వర్గంబు విరియించు బాస
వేదోక్తభక్తి సంపాదించు బాస - యాది శివాచార మలరించు బాస
శిరమట్టఁ [1]బాసిన శరణను బాస - శిరమున కట్టు [2]వాసిన మ్రొక్కు బాస
ముట్టినచో [3]వెన్క మెట్టనిబాస - యిట్టివన్నియుఁ దుదముట్టించు బాస
బసవనిచరితంబు బసవఁడే యెఱుఁగు - వసమె యెవ్వరికైన వాక్రువ్వఁదలఁప
[4]ధీరంబుకట్ట గంభీ[5]రంబుతిట్ట - సారార్థములప్రోక జ్ఞానాగ్ని కాఁక
ప్రతినలగుడ్డ విశ్రుతభక్తిగడ్డ - వ్రతములపంట వైరాగ్యంబువెంట
సత్యంబుకలను ప్రసాదంబుకొలను - కృత్యంబుతాఁప యకృత్యాబ్ధితేఁప
వేదాంతములపాటి విద్యలమేటి - నాదంబుక్రోలు సమ్మోదంబుకీలు
శాంతతనెలవు యీశ్వరుకట్టినలవు - దాంతతకలిమి నిత్యత్వంబు [6]బలిమి
వినయంబుతేట వివేకంబుకోట - యనురక్తి యిల్లు నుదాత్తత పెల్లు
తత్త్వంబుతీగ మహత్త్వంబుచేగ - సత్త్వంబు వెన్ను నాస్థానంబు చెన్ను

బసవేశ్వరుని దర్శింప శివభక్తు లరుదెంచుట


బసవఁడు కేవలభక్తుండె యనుచు - [7]వసిగొని లోకముల్ [8]వర్ణన సేయ
నొక్కొక్క నియమంబు నిక్కంబుగాఁగఁ - జక్కన దర్శింపఁ జనుదెంచువారు
చేకొన్నవ్రతములు చెల్లించు[9]వారు - ప్రాకటవ్రతబుద్ధిఁ బఱతెంచువారు
“ఖ్యాతుఁడో భక్తిసమేతుఁడో యరసి - చూతముగాక!” యంచును వచ్చువారు
“బసవనిచేఁ బూజ [10]వడయుద"మనుచు - నెసకంబు దళుకొత్త నేతెంచువారు
“నతనిఁజూచినఁ జాలు నభవునిభక్తి - యతిశయంబగు” నని యరుదెంచువారు
బసవతీర్థం బేఁగు [11]పరస యనంగఁ [12]బసిగొని యిలఁ గ్రిక్కిఱిసి వచ్చువారు
కరితురగాందో[13]ళవిరచితానేక - వరరథారూఢులై యరుదెంచువారు
[14]ప్రకటరుద్రాక్షసన్మకుటవర్ధనులు - సకలాంగభసితాది శాసనధరులు
విరచితవస్త్రోపవేష్టితమకుటు - లురుజటాజూటవిస్ఫురితశాసనులు

  1. బాసియు
  2. వాసియు
  3. వెన్ను
  4. ధీరంపుఁగట్ట
  5. రంపుఁదిట్ట
  6. చెలిమి
  7. పసి
  8. ప్రస్తుతి
  9. మనుచుఁ-బ్రా
  10. వడయుదు
  11. పరుస
  12. వసి
  13. ళి
  14. ప్రకటితరుద్రాక్షమకుట