పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/228

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రథమాశ్వాసము

21

భువి జన్మపాపౌఘభూజకుఠార - మవిరళసత్క్రియాష్టాంగసద్భక్త
సందర్శనంబుల సకలపాపములు - డిందు మోక్షాంగన వొందుఁగావునను
నిది ఫలప్రాప్తి యింకిటమీఁద లింగ - పదసేవనోత్కృష్టభవ్యసౌఖ్యంబు
ఫలమిట్టిదని చెప్ప భావింప శ్రుతుల - తలమె జీవన్ముక్తి తత్త్వాత్మకంబు
కావున వేఱె మార్గంబుగాఁ జూడు - భావింప బ్రాహ్మ్యంబు భవునిభక్తియును
గలవండ్రు దర్శనంబులు నాఁగఁ గొన్ని - కలిసియుండునె మున్నొకండొకఁడందు
దర్శనంబులు గల్గఁ దలఁచి రేనియును - దర్శనంబది వేఱెతత్త్వరూపంబు
తలఁప నీశ్వరపదతల్లీయసౌఖ్య -ఫలకారణమె కర్మపాశబంధంబు
నిటుగాకయుభయము నేకమండ్రేని - యటుగాదువో నిటలాక్షుభక్తునకు
“ధర నన్యదేవతాస్మరణమాత్రమున - నిరువదెన్మిదిఁగోట్లు నరకంబు [1]లొందు”
నన శ్రుతు[2]లందును వినరె [3]బాపనికి - దినకరపావకదిక్పాలకులను
హరివిరించ్యాదుల నఖిలదేవతల - ధర మూఁడు సంధ్యలఁదాఁగొల్వవలయుఁ
గొలువక తక్కినఁ బొలిసె బ్రాహ్మ్యంబు - కొలిచెనేనియు భక్తి వొలిసెఁ గావునను
[4]బ్రాహ్మణుఁడేనియు భక్తుఁడెట్లగును? - [5]బ్రాహ్మణుఁడెట్లగు భక్తుఁడేనియును?
[6]మావిడిబీజంబు మహిమీఁద విత్తఁ [7]గా వే మగునె పెక్కుగథలేమి చెప్ప?
[8]సహజలింగైక్యనిష్ఠాయుక్తి భక్తి; - బహుదేవతాసేవ బ్రాహ్మణపథము;
కులసతియట్లు నిశ్చల యుక్తిభక్తి; - వెలయాలియట్టు లవ్విప్రమార్గంబు,
కాదేని నందిముఖ్యస్థితిఁ గొలిచి - యాదిదేవుఁడ [9]దైవమనుమంత్ర మెఱిఁగి
తా రుద్రవేషంబుఁ దాల్చెనేనియును - వారక యట్ల తా వర్తింపవలదె?
యిలువేలుపైన సర్వేశ్వరుఁ డుండఁ - బలువేలుపులఁగొల్వఁ [10]బాడియే చెపుమ?
కాన యిన్నియుఁ జెప్పఁగా బనిలేదు - దాన సందియమె గౌతముని దధీచి
వ్యాసుని [11]శాపంబు వహ్నిపాలైన - భూసురులకు భక్తి వొలుపొంద నగునె?
యురవడిచేసి భక్త్యుద్రేకములను - బరమార్ధ [12]మెడలంగఁ బలికె నా వలదు
ఇది శ్రుతిస్మృతి మూలమేకాని యొండు - పదక [13]వాదంబని భావింపఁజనదు
కర్మమార్గంబగుఁగాక బ్రాహ్మ్యంబు - నిర్మలశివభక్తి నిష్ఠితంబగునె?

  1. లయ్యె
  2. లెందును
  3. బ్రాహ్మనికి
  4. బ్రాహ్మఁడేనియు వెండి
  5. బ్రాహ్మఁడెట్లగు మున్ను భక్తు
  6. మామిడివిత్తు దా మహిమీఁదవిత్త
  7. వేమగునే పెక్కువిధు లేల చెప్ప
  8. సహజైకలింగ
  9. దేవుఁడను
  10. బాపంబు గాదె, పాటియే చెపుమ
  11. శాపంపుటగ్గి
  12. మెఱుఁగక
  13. వాక్యం