పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/224

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రథమాశ్వాసము

17

ప్రీతిఁ బుత్త్రుఁడు మోడ్పుఁజేతులతోడ - నా తల్లిగర్భంబునందుదయించె;
నర్ధోదయమునంద యతనిలో నున్న - యర్ధేందుమౌళి [1]గుప్తాకృతిఁ దాల్చి
యంగంబుపైఁ గడు సాంగంబుగాఁగ - లింగసాహిత్యంబు లీల నొనర్చె.
“వచ్చిన త్రోవ యెవ్వరుఁ గానకుండ - నెచ్చోట నుండియో యేతెంచెఁ దపసి
యిది యే [2]మొకో!” యని యింటివారెల్లఁ - బదరుచు నంత విభ్రాంతులైచూడ
ముడిచిన మడుపుఁగెంజడముడినడుమ - మృడుని చందంబులు వెడవెడ దోఁపఁ
గట్టిన వెలిపొత్తి కచ్చడంబెందుఁ - బుట్టనిరుద్రాక్షభూషణంబులును
రాగికుండలములు రత్నకంబ[3]ళియు - యోగదండంబునునొకచేత [4]గొడుగు
బూదిబొక్కసమును బొలుపారుమేని - బూదిపై నొప్పు త్రిపుండ్ర రేఖలును
దళతళమను మెర్గుపలువరుసయును - గలయ నొత్తిన [5]వాలుగడ్డంబుఁదనరఁ
దపసులరా జొక్కతపసిచందమున - నపుడు మాదాంబకు ననురాగమెసఁగ
“నిల్లకప్పడిసంగమేశ్వరంబందు - నెల్లప్పుడును నున్కి యెట్టులంటేని
యేను గూడలి సంగమేశ్వరు పేర - కాన యాగుడిలోనఁ గదలకుండుదును
నా కొడుకొక్క జన్మమున నితండు - లోకహితార్ధమై నీకుదయించెఁ
గాన వచ్చితిఁ జూడఁగా నీ భవమున - కేన చూ గురుఁడ నింకిటమీఁదటికిని
నీనందనునకు లింగానర్పితంబు - [6]లాన సుమీ యించుకంతైనఁ గుడుప”
ననుచు నదృశ్యుఁడై యరిగె నతండు - మనసిజహరుఁడు [7]దాఁజనఁగ నంతటను
బాలార్కకోటుల ప్రభలు గీడ్పఱచు - బాలుని తేజంబు [8]వర్వుటఁ జేసి
సూచీముఖంబైనఁ జొనుపంగరాని - యేచినతిమిరంబు నెల్లమానవుల
యజ్ఞానతిమిరంబు నావంతలేక - విజ్ఞానమయుఁగని వేగంబ పాయ
వేగక వేగినవిధమైనఁజూచి - రాగిల్లె నిఖిలంబు రవి [9]పాఁగె ముడిగె
జననియు జనకుండు సత్పుత్త్రుఁజూచి - యనురాగరసవార్ధి మునిఁగి యాడుచును
భక్తులఁ బిలువంగఁబనిచి యిర్వురును - భక్తిఁ బ్రణామ [10]మేర్పడ నాచరించి
యిమ్ముల సింహాసనమ్మిడి తత్‌క్ష - ణమ్మ విభూతి వీడ్యమ్ములర్పించి
పాదోదకంబులు వట్టిమైఁగడిగి - బూది ఫాలంబునఁబూసి పైఁజల్లి
పంచమహావాద్యపటలంబులులియ - నంచితాగణ్యపుణ్యాత్ముఁదత్సుతుని

  1. గుర్వా
  2. మకో!
  3. ళము
  4. గొడుగు
  5. డాల(?)
  6. లానచూ! యంచుకయైనఁ గుడ్సినను
  7. తా ననఁగ
  8. పరగుటఁ జేసి
  9. పాంగ్య, పాంక
  10. మొప్పఁగ