పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/222

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రథమాశ్వాసము

15

యోగీంద్రహంసుఁ డయ్యువిదగర్భమున - రాగిల్లుటనొ నడ వేగంబు వదలె
ననఁగ మానినిగర్భ మంతకంతకును - నినుపారి తనుపారి [1]పెనుపారి పొదలి
నవమాసములు నిండ నందీశమూర్తి - నవకమై కడుపులోనన [2]మవ్వమొందె
జనని గర్భావాసమను గుహాంతరమ - తన సమాధికి సుఖస్థానమై పరగ
సిద్ధపద్మాసనాసీనత నతివి - శుద్ధాత్ముఁడై భూతశుద్ధికిఁ జొచ్చెఁ
గడవ నూకుచు నుదకముఁ బాఱఁజల్లి - యడర నెబ్బంగినో యగ్ని దా నేర్చె
బూది దా రాఁజదు పొగయదు తాను - నూదండు ముట్టించె నొక్కదీపంబు
నొప్పుదీపమునఁ దా నున్నయిల్లెల్లఁ - గప్పుగాలకయుండఁగాల్చె లోపలన
“యిలఁగాలు మోపండు నిట్టిబిడ్డండుఁ - గలఁడమ్మ!” యనుచు శత్రులును మిత్రులును
దమతమ పట్లను దా రుండు నోడి - భ్రమితులైకనుకనిఁ బాఱుచునుండ
నచ్చుగాఁ దాఁ జౌదళాబ్జంబుఁ గడచి - వచ్చి త్రికూటంబు వసుధపై నిలిచి
సచ్చరిత్రత సుప్తసర్పంబుఁ జోఁపి - క్రచ్చఱ షడ్దళకమలంబు నొంది
కర మర్ధి దశదళకమలంబుఁ బొంది - పరగ ద్వాదశదళపద్మంబుఁజెంది
షోడశదళపద్మసురుచిరసౌఖ్య - [3]కేలీవిలోలుఁడై [4]యోలలాడుచును
దాఁటి యాద్విదళపద్మంబునఁ దన్ను - [5]నాఁటించి సచ్చిదానందంబు నూని
చనునధోముఖమగు షట్కమలములు - మునుకొని యిట్లూర్ధ్వముఖములై తనర
నిశ్చలకోదండ నిజగతి నున్న - పశ్చిమనాళ[6]సంభవమైనయట్టి
నాదంబునకుఁ జొక్కి నగముపై మ్రొక్కి - మోదంబునకుఁజిక్కి ముందఱ నిక్కి
సరినూర్ధ్వముఖసహస్రదళాంబుజాత - మరయ నధోముఖమై మించి వెలుఁగ
దివ్యుఁడై షోడ[7]శాంత వ్యోమచంద్ర - భవ్యసుధాపానపారవశ్యమున
నాతతంబుగఁ బరంజ్యోతిస్స్వరూప - మై తన వెలుఁగ వెల్గై వెల్గుచుండ
బలువు ఱా ప్రతిమగర్భంబులోపలను - వెలిఁగెడు దీపంబు విధమును బోలెఁ
బాండురాంగంబైన పడఁతిగర్భమునఁ - [8]బోఁడిగా వెలుగుచుఁ బుత్త్రుఁడీ క్రియను

  1. నను
  2. చెల్వమొందె
  3. క్రీడా
  4. తేలనాడుచును
  5. 'నాటు' నిరనుస్వారముగా శబ్దరత్నాకరమందున్నది. వ. మీటుగలరథికులను నొక| నాటికి వేవురవధింతు నరుశరములు నో| నాటి పడవైచునంతకు| వేటాడెదఁ బ్రతిబలంబు వీరులనెల్లన్. భార. ఉద్యో. 4ఆశ్వా. ఈ పద్యమునుబట్టి శబ్దరత్నాకరకారులు నిరనుస్వారతను నిర్ణయించిరి. కాని దీనిఁబట్టియే సానుస్వారత సాధితమగుచున్నది. పయికందము నాల్గుచరణములందు ననుస్వారముండఁదగును. 'నాటు'లో ననుస్వారము కలదని పయిద్విపదప్రయోగము కూడఁ జెప్పుచున్నది. భీమఖండమం దీ క్రింది ప్రయోగముగూడ నున్నది. “నాఁటె మందారతరువులతోఁటలందు-” 4 ఆశ్వా.
  6. సంబంధమైనట్టి
  7. శాంతర్వ్యోమ
  8. ఈ కవి యిట్టిప్రాసము మఱికొన్నిచోట్లఁగూడఁ గూర్చినాఁడు.