పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/221

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

14

బసవపురాణము

మెత్తనివస్త్రముల్ మెయినండఁ [1]గప్పి - యుత్తమాభరణంబు లురుగజ్జియలును
నందెలు [2]గంటలు నలవడఁగూర్చి - పొందుగాఁ బసిఁడికొమ్ములు [3]గొరిజియలు
వెట్టి ఫాలంబునఁబట్టంబు వెలయఁ - గట్టి నందికి నలంకారంబు సేసి
యక్షతధూపదీపాదులొనర్చి - యక్షణంబున బంచభక్ష్యముల్ [4]కుడిపి
పులగంబు ముందటఁ [5]జబ్రోవగాఁ బోసి - పులకండమును నెయ్యిఁ గలపి యర్పించి
పరమమాహేశ్వర[6]ప్రతతికి నెల్ల - బరిణామ మంద సపర్యలు సేసి
“నందీశ! [7]నందీశ! నవనందినాథ! - ఇందుకళాధరు నెక్కుడుఁగుఱ్ఱ!
నా యన్న! నా తండ్రి! నా యాలఱేఁడ! - నీ యట్టి సద్భక్తు నీ యట్టిపుత్త్రు
ఖ్యాతిగా నొక్కనిఁ గరుణించితేనిఁ - బ్రీతి యెలర్ప నీ పేరిడుదాన”
ననుడు నప్పుడు మాదమాంబకు నంది - జనులెల్ల నెఱుఁగఁ [8]బ్రసాదంబు వెట్ట
నక్కున మోమున నా ప్రసాదంబు - మక్కువ నెక్కొల్పి మఱి మౌళిఁదాల్చి
మ్రొక్కి నిజావాసమునకు నేతెంచె - నెక్కుడు శుభచేష్ట లెదురుకొనంగ
నంత నెప్పటికంటె ననురాగరసము - వింత వేడుక వుట్టి వెలఁదియుఁ బతియు
లీల వర్తిల్ల; మున్భూలోకమునకు - బాలేందు శేఖరుపనుపునఁ జేసి
వచ్చిన నందికేశ్వరుఁడాత్మలోన - నచ్చెరువంది తా నరుదెంచుపనికి
ననుగుణంబుగఁ దన్నుఁ దనయునిఁగాఁగ - వనజాక్షి [9]నోమె నేమని చెప్పవచ్చు.
దలఁచిన కార్యంబు దలకూడె ననుచు - వెలఁదిగర్భమునఁ బ్రవేశింపఁ దడవ
మగువకంతట నెల మసలెఁ దోడ్తోన - తగగర్భచిహ్నముల్ [10]దా నంకురించె
నమృతాం[11]శుఁడగుపుత్రుఁడతివగర్భమున - నమరియుండుట [12]నొక్కొ యాఁకలిగాదు
జలజాక్షి కడుపున సద్భక్తిరుచికుఁ - డలరుటనో రుచులరుచులై తోఁచె;
బాండురాంగునిమూర్తి పడఁతిగర్భమున - నుండుటనో [13]వెలరొందె మైదీఁగె
పడఁతిశీలపుఁజూలు భవిపాకములకు - నొడఁబడకునికినో యోకిళ్లు పుట్టెఁ
గ్రాలుచు సుతునిరాకకు నోరు దెఱచు - లీలనో సతికావులింతలు పుట్టె
శివమూర్తి దనకు లోనవుటనో తవిలె - శివయోగనిద్ర నాఁ జెలువకు నిద్ర
కాలకంధరుమూర్తి గడుపున నునికి - నో లలితాంగి చన్మొనలు [14]నల్పెక్కెఁ
బెనుపుగ శివమూర్తి వనితగర్భమునఁ - దనరనో నడుము పేదఱిమి వోనాడె

  1. గట్టి
  2. మువ్వలు
  3. గొరిజెలును
  4. వెట్టి
  5. ప్రోక
  6. ప్రకరంబు కెల్ల
  7. నందన్న
  8. బ్రసాదించినంత
  9. నోఁచె
  10. మంకురించె
  11. గు
  12. నకో
  13. వెల్లనొందె
  14. గప్పారె