పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/220

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రథమాశ్వాసము

13

ఇందున్న నేమి? నా కందున్న నేమి? - యెందున్న నేమి? నీయందు నా యునికి.”
అని విన్నవించిన యా నందికేశు - వినయోక్తులకు జగద్విభుఁడిట్టులనియె,
“గురులింగమూర్తిజేకొని వచ్చియేన - పరమతత్త్వార్థతత్పరుఁజేయువాఁడఁ
బ్రాణలింగంబనై భ్రాజిల్లి నీదు - ప్రాణాంగముల నొడఁబడి యుండువాఁడ
రూఢిగా జంగమరూపంబుఁ దాల్చి- వేడుక [1]నినుఁగూడి విహరించువాఁడఁ
దను మనోధనములు [2]దారవోకుండఁ - [3]దనుఁ జేర్చికొనువాఁడ ననఁగి పెనంగి
నా ప్రాణములకుఁ బ్రాణంబగుచున్న - నా ప్రమథులకుఁ బ్రాణంబగు నీకు
నాకును సందొక్కనాఁడు లేకునికి - నీకుఁ దెల్లముగాదె లోకపావనుఁడ!”
అని యూఱడిలఁ బల్కునాశంకరునకుఁ - దనువెల్లఁ జేతులై తా మ్రొక్కి నిలిచి
“విన్నపంబేఁ బనివినియెద” ననుచు - నన్నందికేశుండు సాష్టాంగమెఱఁగి
ప్రమథసన్నిహితుఁడై భ్రాజిల్లు శివుని - నమిత తేజోమూర్తి నాత్మలో నిలిపి
నరలోకమల్లదె నా నింతనంత - నరుదెంచె రయమున; నంత నిక్కడను
గురుతరంబైన శ్రీగిరిపశ్చిమమున - నరనుతం బగుచుఁ గర్ణాటదేశ మనఁ
గడు నొప్పునందుఁ బ్రఖ్యాతసద్భక్తి - సడి [4]సన్నహింగుళేశ్వర[5]భాగవాటి
యను నగ్రహారంబునందు విఖ్యాతి - మనుచుండు మండెఁగ మాదిరా జనఁగ;
నతని పరమసాధ్వి యతివ మాదాంబ - సతతశివాచార సంపన్నధన్య
కొత్తడి [6]నెల్లను గొండొక్క వెద్ద - యుత్తమురాలు ధర్మోపేతగాత్రి
యెల్లవారలకంటె మొల్లంబునందు - నల్లవో యనుజీవనంబునఁ బొదలి
కొడుకులు లేమికిఁ గడు [7]దుఃఖి యగుచు - వెడనోము [8]లన్నియు వేసర నోమి
యాద్యులు వొత్తంబులందెల్ల వెదకి - "హృద్యంబుగా నందికేశ్వరునోము
కామ్యార్థసిద్ధికిఁగారణం"బనుచు - సమ్యగ్వ్రతస్థితి సతికిఁజెప్పుటయు
నమ్మహాత్ములు సెప్పినట్లుగా గుడికి - నిమ్ములఁజని నందికేశ్వరుఁజూచి
సర్వాంగములు ధర సంధిల్ల మ్రొక్కి - 'సర్వజ్ఞ! నందికేశ్వర! దయాంభోధి!'
యంచుఁబ్రస్తుతి చేసి యతిభక్తి మ్రొక్కి - యంచితవ్రతచర్యలాచరింపుచును
నిమ్ముల సోమవార మ్మాదిగాఁగఁ - దొమ్మిదిదినములుత్సుకవృత్తి నోఁచి
మఱునాఁడు నందిని మజ్జనంబార్చి - గుఱుతైన చందనకుసుమంబు లిచ్చి

  1. నీ తోడ
  2. దారువోకుండ
  3. నను
  4. సను
  5. భాగవాడ, భోగవాడ
  6. లోనెల్ల, లోపల
  7. ఈ కవి యిట్లు స్త్రీలింగ రూపముండవలసినపట్లఁ బుంరూపముకూడఁ బ్రయోగించును.
  8. లొగిఁ గొన్ని