పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/217

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

10

బసవపురాణము

వేదాంతసూక్తుల వెడ [1]దొక్కుఁబల్కు - లాదిశివాచారమదియ వర్తనము
గాను మదీయాంఘ్రికమలంబు లాత్మ - లో ని[2]డుకొని భక్తిలోలత్వ మెసఁగ
బలువిడిఁబాఱునేఱుల నట్టనడుమఁ - జలికాలమెల్లఁ బుక్కిలిబంటి నిలిచి
యేకపాదాంగుష్ఠమిలమీఁద మోపి - యాకసంబునకు ముఖాంబుజ మొగ్గి
వర్షంబు [3]భోరన [4]వఱుగొని కురియ - హర్షంబుతోడ నల్లాడక నిలిచి
మేదినిఁదలమోపి మీఁదికి రెండు - పాదంబు[5]లను నెత్తి పంచాగ్నినడుమఁ
దలఁచిన డెందంబు దాపంబుఁ బొందఁ - బలికిన నొరెల్లఁబటపటఁబగులఁ
జూచినఱెప్పలు సుఱచుఱఁగమర - నేచినయెండల నెడపక నిలిచి
భువియు వడంక నంభోనిధులింక - రవిశశుల్ గ్రుంకఁగూర్మంబు దలంక
దిక్కరీంద్రులు ద్రుంగ దిక్కులు గ్రుంగ - నక్కులాద్రులుస్రగ్గ నహిపతి మ్రొగ్గ
దిక్పతుల్ బెదర నద్దివియెల్లనుదర - వాక్పతి యదర నధ్వరములు సెదర
హరితల్లడిల్ల బ్రహ్మాండముల్ డొల్ల - ధరనుల్కములు (లును?) డుల్ల సురలుభీతిల్ల
నపరిమితంబైన యతివీర ఘోర - తపమాచరించెఁజిత్రము చిత్రమనఁగ;
నంత భయభ్రాంతులై యజాచ్యుతులు - సంతాపచిత్తులై సకలదేవతలు
గ్రక్కున మాయున్నకడకు నేతెంచి - మ్రొక్కి సాష్టాంగులై మోడ్పుఁగేలమర
“దేవ! దేవేశ్వర! దేవతారాధ్య! - దేవచూడామణి! దేవాధిదేవ!
పరమభట్టారక! పరమస్వత్రంత్ర! - పరమేశ! పరమాత్మ! పరమ! పరుండ!
శంకర! పంకజసంభవాద్యమర - శంకర! దురితభయంకర! యభవ!
యక్షయ! సర్వజ్ఞ! యఖిలలోకైక - రక్షక! దక్షమఖక్షయ!దక్ష!
యని మమ్ముఁ గీర్తింప నచ్యుతాదులను - గనుఁగొని యేమును గన్నుల నవ్వి
“యింత సంతాపింప [6]నేటికి మీకు - భ్రాంతిఁ బొందిన [7]వెఱ్ఱిపశుజీవులార!
[8]నందీశ్వరుఁడు సేయునవ్యతపంబు - చందంబు సూచియో శంకించి రాక
చీరికిఁ గైకొన్నె శ్రీప! నీ పదవి - కోరునే బ్రహ్మ! నీ [9]కొండుకపదవి
ఓరి దేవేంద్ర! నీ [10]యొడఁబడుపదవి - [11]పే రతఁ డెఱుఁగునే పెక్కు లేమిటికిఁ
ననుఁగాని యాతండు నాపదంబైన - మనమునఁ దలఁపడు [12]మా భక్తులాన”
యనుచుఁ బ్రసన్నుండనై యేను వారి - మనముల దిగులెల్ల మాన్పంగఁ దలఁచి
యందఱుఁ గొలిచిరా నచటికిఁబోయి - నందికేశ్వరుడాయ ముందట నున్న

  1. ద్రొ
  2. డి
  3. జోరన
  4. వలగొని
  5. లెత్తుక
  6. నేఁటికి
  7. యట్టి
  8. నందికేశ్వరుచేయు
  9. కొండొక
  10. యొడిఁబడు
  11. పే రాతఁ డడుగునే
  12. మా కన్నులాన మా భక్తులార