పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/214

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రథమాశ్వాసము

7

ప్రథమాశ్వాసము

కథారంభము

[1]శ్రీకీర్తిసంచితాంచితవరభక్తి - సాకార! వినమితామాత్య సంగాఖ్య!
శ్రీరజితాచలశృంగంబునందు - మారారి యుమయును [2]మానిత క్రీడఁ
దగిలినసుఖ[3]సత్కథావినోదమున - సొగయుచు నున్నెడ శుద్ధశివైక
మానసు [4]లగు నుపమన్యుఁడు భృంగి - యానందికేశ్వరుఁ డాదిగాఁ గల్గు
ప్రమథులు గొలువంగఁ బరిమితంబైన - సమయోచిత మెఱింగి చనుదెంచి ప్రీతి

నారదుఁడు కైలాసమున కేఁగుట


నారదుండను మునినాయకోత్తముఁడు- భూరిసర్వాంగముల్ భువిఁబొందమ్రొక్కి
ముకుళితహస్తుఁడై మ్రొక్కుచు మఱియు- సకలలోకాలోకచరితంబు లెల్ల
విన్నవింపఁగ నున్న [5]కన్నెర్గి శివుఁడు- వెన్నెలగలకంట [6]వీక్షింపుచున్న
యవసరోచితమున నంబికాదేవి - శివుననుమతమునఁజేసన్నఁబిలిచి
“పోయివచ్చినకార్యములు విన్నపంబు- సేయు [7]మీ వున్నట్లు శివునకు” ననిన
నమ్మునీశ్వరుఁడు మహాలింగదేవు- సమ్ముఖుఁడై కరాబ్జమ్ములు [8]మొగిచి

నారదుఁడు శివునకు భూలోకవృత్తాంత మెఱిఁగించుట


“సకలలోకాలోకచరితంబు లెల్లఁ - బ్రకటితభక్తి నెప్పటియట్ల పరగు
నరలోకమున నుమానాథ! మీ భక్తి - చరితమేమియును విస్పష్టంబు గాదు.
తవిలి శివాచార[9]తత్పరులగుట - భవులతోఁ గొందఱు పలుకకున్నారు
లోకప్రపంచంబులోఁ గొందఱుండి - లోక[10]బోధకు లోను గాకున్నవారు
మఱికొందఱానందమగ్నులై తమ్ము- మఱచి లోకములకు [11]మఱపడ్డవారు
ఉన్నతసద్భక్తియుక్తులై కొంద - ఱున్నారు తమతమయొడళులు డాఁచి
యిది కారణముగాఁగ నీశ! మీ భక్తి - తుద మొదలిది యనఁ దోఁప దెవ్వరికి
నందు దృష్టప్రత్యయంబులవలన - సందియంబులు దక్కి సద్భక్తియుక్తి
సుస్థిరలీల లింగస్థలజంగ - మస్థల తత్ప్రసాదస్థలంబులను
సంపన్నులై జగజ్జనులెల్ల భక్తి - సొంపునఁ జుబ్బనఁజూఱలఁ దేల
నీవ ప్రసన్నుండవై వచ్చిలోక - పావనంబుగ భక్తిఁబాలింపవలయు”

  1. పెక్కుప్రతులలో నీ ద్విపదము కానరాదు.
  2. మానవ
  3. 'సంకథా' అని యుండఁదగును.
  4. ఁడగు
  5. కన్నెర్గి యతని; కన్నెఱింగతని
  6. తత్సమధాతువులకుఁగూడ శత్రర్థమున 'నింపు' గలదు.
  7. నీవు
  8. మోడ్చి
  9. తత్పరత్వమున
  10. బాధకు
  11. మఱుపడ్డ