పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/208

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీరస్తు

బసవపురాణము

పాలుకురికి సోమనాథప్రణీతము

ప్రథమాశ్వాసము

శ్రీ గురుదేవు నంచితగుణోత్తంసు - యోగీంద్రహృదయపయోజాతహంసుఁ
బరమకృపామూర్తి భక్తజనార్తి - హరుఁ ద్రిజగత్స్ఫూర్తి నానందవర్తి
భవరోగవిచ్ఛేది భక్తవినోది - శివతత్త్వసంపాదిఁ జిరతరామోది
నిత్యస్వరూపు నున్మీలత్ప్రతాపుఁ - బ్రత్యయగతపాపు భక్తప్రదీపు
భావనాతీతు సద్భావనోపేతు - సావయవఖ్యాతు నమితు నజాతు
నాద్యంతరహితు వేదాంతార్థసుహితు - విద్యాత్మసహితు సంవిత్సౌఖ్యమహితు
భక్తపరాధీను భక్తనిధాను - భక్తసమాధాను భక్తావధాను
భక్తపరంజ్యోతి భక్తవిభూతి - భక్తదుఃఖారాతి భక్తానుభూతి
భక్త[1]వజ్రత్రాణు భక్తధురీణు - భక్తజనప్రాణుఁ బరమకళ్యాణు
మన్మనోరమ్యు నిర్మలభావగమ్యుఁ - జిన్మయు సౌమ్యు భజించి కీర్తించి;
యుల్లమున మదీయవల్లభుఁ జెన్న - మల్లికార్జు[2]నుఁ దేటతెల్లగా నిలిపి;
సముదితసారూప్యశాశ్వతతనులఁ - బ్రమథులఁ ద్రిభువనప్రమథులఁ దలఁచి
ప్రకటలింగైక్య పురాతనభక్త - నికరంబు శివునంద నిష్ఠించి కాంచి;
వ్యక్తలింగముల సద్భక్తిరసా - షిక్తుల నూతనభక్తులఁ గొలిచి;

  1. వజ్ర
  2. నదేవుఁ దెల్లఁ