పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/200

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పీఠిక

165


గారు సేకరించిన ప్రతులలోని పాఠములను దోడుచేసికొని యీ ముద్రణము సాగించితిమి. శ్రీ గిడుగు వెంకటరామమూర్తి పంతులుగా రొకతాళపత్ర ప్రతి నొసఁగిరి. ముద్రణ సమయమునఁ గ్వాచిత్కముగా దానిని గూడఁదోడు చేసికొంటిని. భీమకవి కన్నడకృతియుఁ, బిడుపర్తి [1]బసవన పద్య బసవపురాణమును నాకు మిక్కిలిగా నుపకరించినవి. కన్నడ బసవపురాణము తీరు తిన్నన లేని ప్రాఁతకాలపు రోఁతయచ్చులో నుండుటచేఁ బ్రతిపదము దానిని బరికించుట యసాధ్యమయ్యెను. ఆవశ్యకము గల్గినపట్టులమాత్రమే దానిఁ జూడఁగల్గితిని. అది సుముద్రణమున నుండెనేని నాకింక నెన్నో యపూర్వ విషయములు తెలియఁ దగియఁదగియుండెడి వని నమ్ముచున్నాఁడను. ముద్రితమైన సంస్కృత బసవపురాణము నిష్ప్రయోజనమే. అది మిక్కిలి సంక్షిప్త మైనది. కొందఱు భక్తుల పేళ్ళు మొదలగువానినొకవిధముగా దానిని బట్టి నిర్ణయించుకొంటిని. అఱువత్తుమూవుర పేళ్ళు, ద్రవిడ కర్ణాటాంధ్రసంస్కృత గ్రంథములలో భిన్నభిన్న రీతులతో నున్నవి. తాళపత్రప్రతులలోని పాఠములను సాహసించి సంస్కరింపరాదనుతలంపుతో నుండుటచేతను, నవి యిదమిత్థమని నిర్ణయింపఁ గుదురనివై యుండుట చేతను నక్కడక్కడ మిక్కిలి త్రొక్కటపడితిని. తొలుత నీ గ్రంథమును భాషాతత్త్వపారంగతులగు శ్రీ గిడుగు వెంకటరామమూర్తిపంతులుగారును నేనును గలసి పరిశోధింపఁ దలఁచుకొంటిమి. కాని, వారు సుదూరదేశమున నుండుటచే నట్లు ఘటింపదయ్యెను. ఈ ముద్రణమున దొరలిన దోషములతో నాకే కాని వారికి సంబంధము లేదు. వారి తోడ్పాటుండినచో నింకను నిది గుణోత్తరముగా సాగియుండెడి దనుకొనెదను.

  1. పద్య బసవపురాణకర్త పిడుపర్తి సోమనాథుఁడని కవుల చరిత్రము మొదలగు గ్రంథములు పేర్కొన్నవి. ఆ గ్రంథమున గద్యములందుఁగూడ నట్లే కాననగును. కాని, కృత్యవతరణికలోఁ జూడఁగాఁ దత్కర్త పిడుపర్తి బసవనయని యేర్పడును. పరిశోధించియే నే నీ మార్పును జేసితిని. గద్యములందు సోమనాథుఁడని యుండుటకుంగారణము మృగ్యము.