పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/196

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పీఠిక

161


మొదలగు వానిలోఁగొన్ని పట్టులు చదువునప్పుడు మనసు ద్రవించితీఱును. బెజ్జమహాదేవి కథయు గొడగూచి కథయుఁ గన్నప్పని కథయు జదువునప్పుడు నేను బెక్కు తడవలు కరఁగితిని. మాయమర్మలు లేని విశుద్ధముగ్ధభక్తిని బ్రకటించుటలో సోమనాథుఁడక్కడ మధుర మధురములయిన జానుఁదెనుఁగుఁబలుకుల జాలువార్చి ముద్దులు గురిపించెను. శబ్దాలంకారములకయి, యర్థాలంకారములకయి, సోమనాథుఁడెక్కడను బాధపడలేదు. తనకుఁదెలియక యప్రయత్నముగాఁ బొందుపడినవే కాని యాలంకారికులు పేర్కొన్న కావ్యగుణముల ననుధ్యానించి పనిపూని చొప్పించినట్టు కన్పట్టుపట్టు లీ గ్రంథమున నెక్కడను గానరావు. సులువుగా రచింపఁదగిన ద్విపద మగుటచే సోమనాథుని చూపు కథాకల్పనమందును, విషయవిన్యాసమందును, భావప్రపంచమందును బరుగులువాఱినదే కాని, యతిప్రాసచ్ఛందోభాషాబంధములందుఁ జిక్కుకొని యెక్కడను ద్రొక్కటపడలేదు. అట్లు పరుగువాఱుటలోఁ బెక్కుపట్టులందీతఁడు పాఠకుఁడు సరిగాఁ దన్నువెన్నాడఁగలఁడా యనికూడఁ జూడఁబోఁడయ్యెను. పదులకొలఁది ద్విపదలు గడచినను బయికిఁబయికి వాక్యము పొడుగువాఱుచు సాగుచుండుటే కాని ముగియకుండుట నీ గ్రంథమునఁ బెక్కుపట్టులఁ జూడఁగలము. అట్టు ముగియకుండుటలోఁ గర్తృపదము రెండుమూఁడు తడవలు గూడ మరల మరలఁ గానవచ్చుచుండును. ఇట్టి యిక్కట్టు పండితారాధ్యచరిత్రమున మఱింత గలదు.

శివభక్తిస్మరణము వచ్చినప్పు డీతఁడొడలు మఱచును.

“పొరి మజ్జనోదకంబులకట మున్న
 పరముపై నానందబాష్పముల్ దొరుగఁ
 బూజించు నవపుష్పరాజికి మున్న
 రాజాంకుపై హృత్సరోజంబు విరియ
 ధూపవాసనకు మున్ ధూర్జటి మ్రోల
 వ్యాపితాంతర్గతవాసన దనర
 వెలుగు నీరాజనంబుల కటమున్న
 మలహరునంద యాత్మజ్యోతి ప్రబల