పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/195

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

160

బసవపురాణము


పరివర్తనముల తీరు

ఈ బసవపురాణమును బద్యకృతిగా రచించిన పిడుపర్తి బసవన కడునేర్పరి. ఆతఁడు ద్విపదలను నిపుణముగాఁ బద్యములందట్లే పొందించి నాఁడు. ఈ గ్రంథమున కది కొన్నిపట్టులఁడిప్పణిగాఁగూడ నుపయుక్త మగును. కాని, యా రచనము చాల సంగ్రహముగా నున్నది. కొన్నిపట్టు లాతఁ డర్థముకాక విడిచినాఁడు. భీమకవి కన్నడింపు మిగుల నెన్నఁదగినదిగా నున్నది. ఆతఁడు దీనిని తు-చ- తప్పకుండ ముక్కకు ముక్కగాఁ గన్నడించినాఁడు. కొన్ని పట్టులనించుక పెంచినట్లును గానవచ్చును. మిక్కిలి చిక్కుగా దుర్‌జ్ఞేయములు గానున్న పట్టులు గొన్ని యా కన్నడకృతిద్వారమునఁ దెలిసికొన నా కనువు పడెను. శబ్దరత్నాకరాదులలోఁ గానిరాని యనేకాపూర్వశబ్దములకుఁ గన్నడ కృతి తోడ్పాటున నేనర్థము గ్రహింపఁగల్గితిని. ఈ తెల్గుకృతికది ప్రశస్తమయిన టీక యనఁదగును.

రచనా సౌందర్యము

మన సోమనాథుని రచన మసాధారణ సౌందర్యము గల్గియున్నదనుట యతిశయోక్తి గాదు. ఛందస్సు, భాష, విషయము మూఁడును దేశీయములే యగుటయు, కవి శివతత్త్వానుభవమున నోలలాడుచుఁ దన్మయుఁడై కవితావేశము వొందియుండుటయు నట్టి యసాధారణ సౌందర్యమునకుఁ గారణములు.

వడిఁబాఱు జలమున కొడలెల్లఁ గాళ్లు
పడిఁగాలు చిచ్చున కొడలెల్ల నోళ్లు
వడి వీచు గాడ్పున కొడలెల్లఁ దలలు
వడిఁజేయు బసవన కొడలెల్ల భక్తి.

అని బసవనిఁగూర్చి సోమనాథుఁడు భావప్లుతములుగాఁ బలికిన పలుకులు స్వవిషయమునఁగూడ సమన్వితములయ్యెను. ప్రతిపదమునను శివభక్తి పరవశుఁడై యుండి సోమనాథుఁడు గ్రంథముల రచియించెను. ముగ్ధభక్తుల కథలు