పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/153

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

118

బసవపురాణము


బూర్వకాలమున 'ఁబు' అను రూపముకూడ నుండెడిది. ఆ కాలమున వనమ్బు, వనఁబు, రూపములే ప్రధానముగా నుండెడివి. వనమ్ము, వనము రూపములు పయి రూపములకంటె నర్వాచీనములు. ప్రాచీనశాసనము లీ విషయమును నిరూపించుచున్నవి. ద్రవిడభాషాశబ్దస్వరూప మిందుకుఁ దోడువలుకుచున్నది. 'క. ఎట్టి విశిష్టకులంబునఁ బుట్టిన ! సదసద్వివేకములు గల్గిన ' ఇత్యాది విధముల నన్నయాదు లీ యతిని బ్రయోగించిరి. వనఁబు రూపమున్న కాలమున నేర్పడినదగుటచే నీ మువిభక్తికయతి ముకారయతి వంటిది గాదయ్యెను. ప్రాచీనులు ముకారయతిని బ్రయోగించిరనుట కప్పకవి యుదాహరించిన వసంతవిలాస పద్య మప్రయోజకము. తక్కిన పద్యము లర్వాచీనకృతుల లోనివి.

శివకవు లఖండయతిని ప్రయోగించిరి. పండితారాధ్యుఁడు 'వేదోక్తముగ నెఱుంగవలయుఁ దుదిని మహేశా' అనెను.

సోమనాథుఁడు నామాఖండయతిని గూడఁ బ్రయోగించెను.

మఱియు నేకాంతరామయ్యనా నొక్క -బసవ. పు.170

మఱియును శివనాగుమయ్యనా నొక్క

- ఖండమై తనరు నాగయ్యహస్తమున - పండితా. ప్రథమప్రకరణము. అనియు గలదు.

చేయుడు లెంకమంచెన పండితులకు
శ్రీరమణుండు మంచెన పండితయ్య. -బసవ. పు. 198

ఇందు 'మంచెన' పదము నేఁడు 'మంచన' యని ప్రయుక్తమగును. ఆనాఁ డిట్టి నామపదములలోఁ కొన్నింట అన, అయ, అను విధమునఁ బదచ్చేదము కానరాదు. నన్నియ, మల్లియ, మంచెన, కూచెన, ఉదాహరణములు. నేఁడివి నన్నయ, మల్లయ, మంచన, కూచెనలుగా మాఱినవి. నన్నయకూడ నొకవిధమున నామాఖండయతిని బ్రయోగించెను.