పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/15

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

viii

ములను బూని శివద్రోహులను, జైనులను జంపుట ఘోరకార్యమైనను వీరశైవప్రభావమును విశదముచేయుచున్నది. జగదేవుఁడు వీరతాంబూలంబును గొని బిజ్జలుని సంహరించి, ఆత్మహత్యను జేసికొనెను. నాచిదేవయ్యయును, పండ్రెండువేల శివభక్తులును జైనులను సంహరించిన విధము భయంకరమై వీరశైవదీక్షాప్రభావమును విశదము చేయుచున్నది. వీరశైవ మచిరకాలముననే కర్ణాటాంధ్రద్రావిడదేశములందు వ్యాపించి ప్రజాహృదయము నాకర్షించుటకు వీరమాహేశ్వరభక్తియును, సాంఘికవ్యవస్థలును గారణంబులు.

వీరశైవసంఘము

వీరశైవమునకు శివభక్తి, లింగధారణము, విభూతి రుద్రాక్షధారణము, పంచాక్షరీమంత్రము, లింగపసాయిత శస్త్రధారణము ప్రధానలక్షణములు. వీరశైవమునందు శివభక్తి వీరస్వరూపమును దాల్చుచున్నది. శివభక్తిపరవశులైన భక్తులు తమ కన్నులను, దారాపుత్రాదులను, ప్రాణములను శివార్పణముచేసి కైవల్యమును బొందినవిధమును భక్తులకథలు దెలుపుచున్నవి. కన్నప్ప, సిరియాలుఁడు, నిమ్మవ్వ, కుమ్మరగుండయ్య, చౌడయ్య, బొమ్మయ్య, వైజవ్వ, దూడయ్య, శ్వపచయ్య, కక్కయ్య, గుడ్డవ్వ మొదలగు భక్తులకథ లత్యద్భుతమైన వీరభక్తిని దెలుపుచున్నది. భక్తుల ప్రాకృతనామములె చిత్తపరివర్తనమును దెలుపుచున్నది. వీరశైవధర్మము సాంఘికపరివర్తనమును, మతపరివర్తనమును ప్రతిపాదించినది. వీరశైవసంఘమునకు బసవేశ్వరుఁడు దండనాయకుఁడు; మాహేశ్వరులు సేనాపతులు, భక్తులు సైనికులు. భక్తసైన్యము శత్రుమిత్రాభిమానమును, ప్రాణమానధనాభిమానమును లేక శైవధర్మనిర్వహణమును జేయఁబూనినది. జంగములైన శివభక్తు లందరును శివస్వరూపులు. వీరశైవులు బ్రాహ్మణులు - మాలలు, పండితులు - పామరులు, ప్రభువులు- ప్రజలు, స్త్రీలు - పురుషులు, దొంగలు - దొరలు మొదలగు భేదావరణము లేని శివభక్తులు. శివభక్తులు వారి సర్వస్వమును జంగముల కర్పించి శివానందమును బడయుదురు. వీరశైవము జంగమభక్తిని, భవినిరసనమును బోధించినది. లింగధారణము లేని వారందఱును భవులు. భవులు నిరసింపఁబడినవిధమును బసవపురాణము, వీరశైవాగమములు విశదము చేయుచున్నది.