పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/143

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

108

బసవపురాణము


పంబవాండ్రయు , బవనీండ్రయు, సుద్దులలోను, మఱియుఁ బెక్కువిధములగు పామర రచనములలోను బహుళముగా ద్విపదయు, మంజరియుఁ గానవచ్చును. కాని, వారివారి పాటతీరులు వేరు గానే యుండును. ప్రాచీనలేఖకు లిట్టిరచనములను దాటియాకులపై వ్రాయునప్పుడు వారు చదువు ఫణితిలో నేర్పడు దీర్ఘస్వరాదులతోనే వానిని వ్రాయుచుండెడివారు. మన బసవపురాణముగూడఁ గొన్ని ప్రతులలో నట్టితీరున వ్రాయబడియున్నది.

కైలాసమునఁ దొల్లి గఱకంఠుగొలూవ
శైలేంద్రకన్యక సనుదెంచు నెడాను.

ద్విపద రచనమున వెలయించుటచేఁ దన గ్రంథములు పండితులకే కాక పామరులకుఁగూడ నుపాదేయములు కాఁగలవని, యట్లు కావలయునని సోమనాథుఁ డభిమానించెను. అవి యట్లే వెలయఁగల్గెను.

ఛందస్స్వాతంత్ర్యము

ఈ యభిమానముచే సోమనాథుఁ డితరాంధ్రకవులు పాటించిన ద్విపద చ్చందోనిబంధమునఁ గొంత స్వాతంత్ర్యము వహించి మాఱుపాటు గావించెను. తాళ్లపాక చిన్నన్న ప్రాచీనసంప్రదాయానురోధమున ద్విపదలక్షణము నిట్లు నిర్వచించినాఁడు.

వాసవుల్ మువ్వురు వనజాప్తుఁ డొకఁడు
భాసిల్ల నది యొక్క పదము శ్రీకాంత
క్రమమున నవి నాల్గు గణముల నడచుఁ
గ్రమదూరముగఁ బ్రయోగము సేయరాదు
ఆ పాదమునకు మూఁడవగణం బాది
దీపించు యతి యంబుధిప్రియతనయ
యుపమింపనవి ప్రాసయుతములై రెండు
ద్విపదనా విలసిల్లె వికచాబ్జపాణి