పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/142

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పీఠిక

107


పద హేతువవుట ద్విపదనాఁబరగు
ద్విపదాంబురుహముల ధృతి బసవేశు
ద్విపదాంబురుహము లతిప్రీతిఁ బూను

- పండితారాధ్య చరిత్రము.

తన గ్రంథములు సుగ్రహములుగా నుండవలెనని యీతఁడు తలంచెను. సంస్కృతభాషలో ననుష్టుప్పు సులువుగా రచింపఁదగినదై, యక్షరబాహుళ్యము లేమిచే సులువుగాఁ జదువఁదగినదై, యన్వయక్లేశము లేమిచే సులువుగా నర్ధము చేసికోఁదగినదై పురాణాదులందు లక్షలకొలఁది గ్రంథసంఖ్యతో వెలసియుండుట యెఱిఁగి దానివలెఁ దెలుఁగున వెలయఁదగినది ద్విపదయని గుర్తించి సోమనాథుఁడు తన ప్రధానగ్రంథములగు బసవపురాణ, పండితారాధ్యచరిత్రములను ద్విపదరచనములందే నెలకొల్పెను. ఆరూఢ గద్యపద్యాది ప్రబంధపూరిత సంస్కృతభూయిష్టరచన సర్వసామాన్యము గాదనియు, జానుఁదెనుఁగు మిక్కిలి ప్రసన్నముగా నుండుననియు, నది ద్విపదరచనమున మిక్కిలి పొసఁగి యుండు ననియుఁ బయి ద్విపదలందు సోమనాథుఁడు సూచించినాఁడు. మఱియు సులువయిన రచనము గలదని ద్విపదను దక్కువగాఁ జూడవలదనియు, సర్వసామాన్యమగుట ద్విపద కొకగుణవిశేష మనియు, గద్యపద్యోదాత్తకృతుల కది తీసిపోదనియు, గావ్యగౌరవమును బోషించునది, దోషరాహిత్యమును గుణసాహిత్యమునుగాని, ఛందఃప్రయాసాతిశయము గాదనియుఁజెప్పినాఁడు.

ద్విపదరచన సర్వసామాన్యమే

వర్తమాన నాగరకలోకము గొంత వర్ణించుచున్నను నాఁడు నేఁడు నాంధ్రలోకము నాలుకలపై నాట్యమాడుచున్న పాటలు, పదాలు మొదలగు దేశిరచనలలో నూటికిఁ దొంబదివంతు రచనములు ద్విపదలును, దద్వికారములునై యున్నవి. ఒక్క ద్విపదమే విషయభేదమునుబట్టి, స్థలభేదమునుబట్టి, పాఠకభేదమునుబట్టి పఠించు తీరులలో బహుభేదములను బొందుచున్నది. తోలుబొమ్మలవాండ్ర యాటలలోను, స్త్రీల పాటలలోను,