పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/119

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

84

బసవపురాణము


సిద్ధనాగార్జునాదులు శ్రీశైలముమీఁదనే నెలవుకొని యక్కడనే స్తూపములఁ గట్టుకొని స్వమతములను వ్యాపింపఁజేయ మొదలిడిరి. జైనబౌద్ధమతములు అహింసాతత్త్వమును బోధించుచు జాతిభేదమును బాటింపక యనుష్ఠానసౌకర్యము గలిగి సర్వసమ్మతములుగా నుండుటచే ననేకు లామతములందుఁ జేరఁజొచ్చిరి. బహుభేదములతోఁ బరస్పరస్పర్దలతో నున్న శైవమతము లానాఁడు సన్నగిలఁ జొచ్చెను. శంకరులవారి యద్వైతసిద్ధాంతము మహోదయము గలదై జైనబౌద్ధమతములనే కాక శైవమతములను గూడఁ జిదుకఁగొట్టసాగెను. ఇట్లు కాలము గడవను గడవను, శైవమతములు చాల సన్నగిల్లుటయు, జైనబౌద్ధమతములు సమధికవ్యాప్తి గలవగుటయు, తర్వాత నద్వైతమతము సర్వాధికవ్యాప్తి గలదగుటయు, దటస్థించెను. 10, 11, 12, శతాబ్దుల నాఁటి కాంధ్రకర్ణాటదేశములందు మతములస్థితి యిట్లున్నది. అప్పుడు జైనబౌద్ధాద్వైతమతముల తళ్లుననుండి స్వమతమును రక్షించుకొనుట శైవమతముల వారి కావశ్యకమయ్యెను. అందుకై యాంధ్రకర్ణాటదేశములందుఁ గొందఱు మహనీయులు వెలసిరి. ఆంధ్రదేశమున వెలసిన మహనీయులు పండితత్రయము, వీరి విషయమింతకుముందే వ్రాసియున్నాఁడను. శివలెంకమంచెన పండితుఁడును, శ్రీపతి పండితారాధ్యుఁడును రచించిన గ్రంథములేవో మనకు దొరకకున్నవిగాని మల్లికార్జున పండితారాధ్యుఁడు రచించిన గ్రంథము, శివతత్త్వసారము, నేఁడు దొరకియున్నది.[1] అందు ముందుగా నద్వైతమతమునే యాయన ఖండించెను. చందవోలు మొదలగు స్థలములం దీ పండితారాధ్యులవారు జైనబౌద్ధమతముల నెట్లు విధ్వంస పఱిచిరో పండితారాధ్యచరితముఁ జదివినఁ దెలియఁగలదు. ఈయన పాశుపతశైవమత ప్రవర్తకుఁడు. ప్రాచీన

  1. ఈ గ్రంథమును దొలుదొలుత నరసాపురమున నొక జంగముదేవరయింట నుండి నేనే దొరతనము వారి ప్రాచ్యలిఖితపుస్తకశాలకై సేకరించితిని. పుస్తకమునఁ గానరాకున్నను నది శివతత్త్వసారమని మల్లికార్జున పండితారాధ్య రచితమని తొలుత గుర్తించి, కీర్తిశేషులయిన కె.వి. లక్ష్మణరావుగారికి దాని యుత్కృష్టతను దెలిపి ముద్రింపఁగోరఁగా వా రాంధ్రసాహిత్యపరిషన్మూలమునఁ బ్రశస్తమయిన పీఠికతోఁ బ్రకటించిరి.