పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/117

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

82

బసవపురాణము


గర్ణాటాంధ్రదేశములందును బ్రచారము గలదు. శ్రీరంగక్షేత్రము వైష్ణవులకును, శ్రీశైలము శైవులకును, దీర్థములుగా నుండెడివి. ద్రవిడదేశమునఁ గూడ మధురాదిక్షేత్రములు, శైవులకుఁ దీర్థములుగా నున్నవి గలవు. శ్రీశైలము కర్ణాటాంధ్రదేశముల కూడలిలోఁ గలదు గావునను, బ్రాయికముగాఁ గర్ణాటాంధ్రదేశములకుఁ బాలకు లొక్కరే యయిరి గావునను, లిపిలో మాత్రమే కాక భాషలోఁగూడ నంతగా భేదములేదు గావునను గర్ణాటాంధ్రు లాకాలమునఁ బరస్పరము మిక్కిలి సన్నిహితులుగా నుండెడివారు. శ్రీశైలము చతుర్ద్వారములు[1] (త్రిపురాంతకము, సిద్ధవటము, అలంపురము, మాహేశ్వరము) గలదై యాకాలమునఁ గర్ణాటాంధ్రశైవాచార్యులకు నిత్యనివాసముగా నుండెడిది. ఎడతెగక శైవులు శ్రీశైలమునకు రాకపోకలు జరపుచుండెడివారు. నిత్యముగా నక్కడ ననేకులు నివసించుచుండెడివారు. సామాన్యముగా నిక్కడ శైవులని నేను పేర్కొన్నను నాకాలపు శైవులలోఁ గొన్ని భేదములు గలవు. ఆ భేదములు పాశుపతము, కాలాముఖము, కాపాలికము మొదలగు పేళ్లుగలవి. శివుఁడే పరతత్త్వమని విశ్వసించువారయినను వీరిలోఁ బరస్పరము మతస్పర్దలు, విరోధములు గూడ నుండెడివి. [2]వీరికెల్లరకు నైకకంఠ్యము లేకుండెడిది. వీరెవ్వరుగాని వర్ణాశ్రమభేదములను విడనాడినవారుగారు. పయిశైవమతముల సూక్ష్మభేదములను స్పష్టముగాఁ గనుఁగొనుటకు బలవత్తరములయిన యాధారములు నేఁడు దొరకకున్నవి. శైవగ్రంథములం దుద్దృతములయిన యాగమతంత్ర

  1. శ్రీశైల సంకల్పము: "పూర్వద్వార త్రిపురాంతక దక్షిణద్వార జ్యోతిస్సిద్ధవట, ప్రతీచీద్వారా ఆలంపురీ బాలబ్రహ్మేశ్వర ఉత్తరద్వార మాహేశ్వరాఖ్య చతుర్ద్వారోపశోభితే”
  2. శ్లో॥ వామాః పాశుపతా శ్చైవ కాలాముఖ మహావ్రతాః
         కాపాలా భైరవా శ్శాక్తా స్స్రావకా యోగధారణాః
        శైవా బహువిధా శ్చైవ వైష్ణవాః పాంచరాత్రికాః;
        వైఘానసాః కులా: కౌలా సత్సంభేదాస్తథా ఉమే;
        సాంఖ్యాశ్చలాకులా శ్చైవ తథా హంసపరాయణాః;
        ఏతే సమయిన స్సర్వే అన్యోన్యకలహప్రియాః;
        ఏతాన్ సర్వాన్ పరిత్యజ్య వీరశైవం వదస్వ మే - వీరాగమము.