పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/112

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పీఠిక

77

మన సోమనాథుఁడుగూడ నీ కథనే పేర్కొన్నాఁడు. [1]శ్రీపతి పండితుని వంశమువాడగు కాశీనాథుని వీరారాధ్యుడు తన ధర్మగుప్తాభ్యుదయమున నీ కథ నిట్లు వివరించి చెప్పినాఁడు.

గీ. అరయఁ దత్పండితేంద్ర నిజాంశభూతి
    భవులు శ్రీపతి మంచెనపండితులును
    మల్లికార్జునపండితుఁ డెల్లజనులు
    వినుతు లొనరింప వెలసి రుర్వీతలమున.

గీ. వారు భువి వీరశైవప్రవర్తనంబు
   బ్రాహ్మణాచార మగునంచుఁ బఠ్యమాన
   వేదవేదాంతసిద్ధాంతవిశ్రుతముగఁ
   దెలియఁజేయుచు విలసిల్ల రలఘుమహిమ.

క. ధీరుడు శ్రీపతిపండితుఁ
    డారయఁ బ్రాచీనదేశికాహ్వయుఁడు మహో
    దారదివాద్వయమార్గ
    స్పారధురంధరుఁడు లోకపావనుఁ డెన్నన్.

క. ఆ గురుడు విజయవాటిని
    భోగోజ్జ్వలమందిరమున బుధయుతుఁడై శై
    వాగమనైగమబోధా
    యోగమునఁ జరింపుచుండి యొకనాఁ డనియెన్.

  1. శ్రీపతి పండితవంశమవారే తర్వాత 'కాశీనాథుని' వారయిరి. కాశీనాథుని వీరారాధ్యులు రచియించిన ధర్మగుప్తాభ్యుదయ భద్రాయుశ్చరిత్ర కృతులనుబట్టియు, తచ్ఛిష్యుఁడగు సిద్ధరామయ్య రచించిన సంస్కృతోదాహరణ స్తవాదులనుబట్టియు నీ విషయము గుర్తింపనగును. కాశీనాథుని నాగేశ్వరరావుగారి కీ వీరారాధ్యుఁడు 5వ తరమువాఁడు. శ్రీపతి పండితోపక్రమముగా వీరారాధ్యులవఱకు వంశక్రమము, పయిగ్రంథములందుఁ గలదు. అది యిట్టిది. -