పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/103

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

68

బసవపురాణము

గొందఱను వేఱొకగ్రంథము పేర్కొనకున్నది. ఒకనికే యొకగ్రంథమున నొకపేరు, వేఱొకగ్రంథమున వేఱొకపేరును గలదు. వానిని సరిచూచి బసవపురాణమునఁ బ్రస్తుతులయినవారిని గూర్చి యించుక వివరణము చేయుచున్నాడను. [1]

సుందరనాయనారు :-పు. 128 [2]నంబినాయనారని ఒడయనంబి యని యీతని నామాంతరములు. సుజ్ఞానిని, జటీశ్వరుఁడు ఈతని తల్లిదండ్రులు. నదిపురపు నరసింహవర్మ (నరసింహమునయర్) ఈతనిఁ బెంచుకొన్నాఁడు. ద్రవిడభాషలో నీతఁడు గొప్పకవి. తిరుతొండర్‌తొఘై యని యీతఁడు రచియించిన శివస్తోత్రమును బ్రపంచించి సోమనాథుఁడు (పు. 134) కొంత తెలిఁగించినాఁడు. ఒడయనంబివిలాసమని యీతని చరిత్రమే తెలుగునఁ బ్రబంధముగా రచితమయినది.

మిఱుమిండఁడు :- పు. 128 మెఱెమిండర్, విఱన్‌మిండర్, వీరమిండ, శంగునాయనార్ అని యీతనిపే ళ్ళితరగ్రంథములఁ గలవు.

చేరమచక్రవర్తి - మహాగోదుఁడని యీతని నామాంతరము. పయి మువ్వురును సమకాలమువారు.

కుమ్మర గుండయ్య - పు. 139 తిరునీలకంఠర్ అని నామాంతరము

దంగుళి మారయ్య - పు. 138 ఇళయాంగుడిమారన్ అని యఱవమున, 'భక్తో దంగుళిమారాఖ్యః ' అని సంస్కృత బసవపురాణమున, 'ఎళయ దంగుళిమారన్' అని కన్నడమునఁ గలదు.

  1. మైసూరు ప్రాచీనవస్తుపరిశోధకసంఘమువారు ఈ సంవత్సరపు కార్యనివేదన ప్రకటనమున 'అఱువత్తుమూవుర' చరిత్రమునుగూర్చి కొంతపరిశోధనము నెఱపినారు. ఇక్కడ నాకది కొంత యుపకరించినది. వీరినిగూర్చి ద్రవిడవిద్వాంసులే యింకను సరియైన పరిశోధనము జరపఁజాలకున్నారు. నేనిక్కడ మైసూరు రిపోర్టులో నున్నక్రమము ననుసరించు చున్నాఁడను.
  2. (ఇందలి ఈ పుటసంఖ్యలు బసవపురాణము ఆంధ్ర గ్రంథమాల - 2 1926 ముద్రణము ననుసరించినవి.) -ప్రకాశకులు.