Jump to content

పుట:ప్రభావతీప్రద్యుమ్నము (పింగళి సూరన).pdf/97

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


తే.

నీవ కద ప్రభావతి యన నిన్ను మున్ను
తరుణి నే వింటి రాగవల్లరియె బోటి
పేరు నీ విపు డన వింటి మీ రిరువురు
నీ యెఱుక మఱచెదరు సూ పోయి వత్తు.

64


ఉత్సాహ.

అనుచు గగనభాగమునకు నంచ యెగయఁజూచిన
దనుజకన్యకాలలామ తనదు రెండుచేతులన్
వినయ మొప్పఁ బొదుగఁ బట్టి వేన వేలుభంగులన్
దనరఁ బ్రియము జెప్పుచును ముదం బెలర్ప నిట్లనున్.

65


సీ.

నిద్దంపుఁబండువెన్నెల గాయుఱెక్కల
            యొప్పు చూడఁగ నొక్కయుత్సవంబు
మెఱుఁగుఁదీఁగెలబాగు మించుపక్షాంతహా
            టకరేఖ లరయ నొండొకప్రియంబుఁ
గమనీయ మగుమహాగమనగాంభీర్యాది
            విలసనం బీక్షింప వేఱె యింపు
మాధుర్యధుర్యకోమలవచనామృతం
            బనుభవింపఁగఁ గౌతుకాంతరంబుఁ


తే.

గలుగఁ జేయుచు నువ్విళ్ళు గొలుపునీదు
సంగతి యొకింత గని యెట్లు జాఱవిడుతు
నింక రాగవల్లరి పేరు నీవు నిజము
ననఁగ నీతో నొనర్తు నెయ్యంపుఁజెలిమి.

66


ఆ.

ప్రణయ మొప్ప మిగులఁ బ్రార్థించుచున్నట్టి
న న్ననుగ్రహించి నాదుచెలిమి
కొడఁబడంగవలయు నోహంసభామినీ
యనుచు వేఁడుకొనఁగ నంచ పలికె.

67