Jump to content

పుట:ప్రభావతీప్రద్యుమ్నము (పింగళి సూరన).pdf/95

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


వేఁడక ప్రోడ లగుగఱువ లిరువు రేకాంతమాడుచోటి
కేటికిఁ బోయెద రిది యట్లు గాదు గదా యే మొక్కసంది
యంబు నివర్తించుకొనం గోరి యిత్తఱి నత్యంతప్రార్థనంబు
గావించుచున్నవారము గావున నీకన్న యప్పురుషుని
యొప్పు నిప్పలుకపై వ్రాసినరూపంబుచొప్పు నొక్కటి
యగునో కాదో యీదండకు వచ్చి నిచ్చలంబుగాఁ జూచి
నిశ్చయించి చెప్పు మిప్పడుచు నేను నిట్టివాఁ డెందును లేఁడు
కలఁ డనువివాదంబునం బన్నిదంబు చఱచినవారము.

52


క.

అనుటయుఁ బందెముకొఱకై
నను వేఱొకపనికినైన నా కది తెలియం
బని గలదె మీకు నాచే
వినవలసినయర్థ మరసి వినిపింతుఁ దగన్.

53


తే.

అనుచు శుచిముఖి తనమాట కాపడంతు
లీక్షితాన్యోన్యవదన లై యెంతదూర
మరుగుచున్నది దీనివాక్యాశయ మని
మివుల వెఱఁగందఁ గొంతచేరువకుఁ బోయి.

54


క.

సవిమర్శదృష్టి నాటిత
కవిధాన మొకింత నడపి కడుఁ బదిలముగా
వివరింప నతనిరూపము
యవు నౌ నది యిందు సందియము లే దనియెన్.

55


చ.

అనుటయు రాగవల్లరి మహత్తరమోదవిశేషసంభ్రమం
బునఁ బఱతెంచి యప్పులుఁగుముద్దియఁదద్దయు ముద్దుగారవం
బును జిగురొత్త నెత్తుకొనిపోయి ప్రభావతిదండఁ బెట్టి యొ
య్యనఁ గొనగోళ్లఁ దత్తనురుహంబులు దువ్వుచుఁ గూర్మి నిట్లనున్.

56