Jump to content

పుట:ప్రభావతీప్రద్యుమ్నము (పింగళి సూరన).pdf/82

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


మునిఁగి యెవ్వరు పిలిచినఁ గినియు మిగుల
హరిసుతుండు ప్రభావతీవిరహవశత.

111


శా.

ధీమంతుండు పటుప్రతాపనయమైత్రీనిత్యనమ్రీభవ
త్సామంతుండు సుకీర్తిమౌక్తికమణిస్రగ్భూషితాశావధూ
సీమంతుండు విపక్షమంత్రిముఖరాజీవప్రభోచ్చాటనా
హేమంతుండు నిజస్తవానుకలనాహ్రీమంతుఁ డత్యంతమున్.

112


క.

అబ్బాంబావరుఁ డఖిలక
కుబ్బాంధవరమ్యకీర్తికుఁడు సలినీప
త్రాబ్బిందుసమప్రకృతి
క్షుబ్బోధమయాత్మతత్త్వకోవిదుఁడు మహిన్.

113


తరల.

కుముదబంధునిభుండు పింగళిగోకమంత్రి యశఃకథా
సమదనల్పసభుండు వైదికశాస్త్రసింధునిరంతర
ప్రమథనాత్తశుభుండు సంతతభక్తియుక్తిసమర్చిత
ప్రమథలోకవిభుండు విత్తనిరంకుశప్రతిభుం డిలన్.

114


గద్యము.

ఇది నిఖిలసూరిలోకాంగీకారతరంగితకవిత్వవైభవ
పింగళియమరనార్యతనూభవ సౌజన్యజేయ సూరయనామ
ధేయ ప్రణీతంబైన ప్రభావతీప్రద్యుమ్నం బనుమహాప్రబం
ధంబునందుఁ ద్వితీయాశ్వాసము.

—————