Jump to content

పుట:ప్రభావతీప్రద్యుమ్నము (పింగళి సూరన).pdf/7

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

హించుచున్నట్టును సమరవ్యూహతంత్రములపట్టున మనము గ్రంథములం జదువుచున్నాము. ఇందలి చిలుకరాయబారము గనుంగొనిన నీతంత్రములు ద్యోతకములు గాకమానవు. ఈగ్రంథకర్త తా నొకస్థలమునఁ జెప్పినమాదిరిని మఱియొకచోటఁ జెప్పుటకుఁగాని, ఒకరు జెప్పినమాదిరి ననుకరించి చెప్పుటకుఁ గాని ఇష్టపడువాఁడు గాఁడు. ఈతనియపారప్రతిభ యవ్యాహతముగా నవసరమువెంబడిని నూతనసృష్టి యొనర్చుచుండును.

అంతఃపురసమాచారము లాస్థానమున కెక్కరాదు. ఒకరిక దూతికలుగ నుండువా రింకొకరికడ దూతికలుగ నుండరు. ప్రద్యుమ్నుఁ డొక్కఁడును కార్యనిర్వహణమునకుఁ జాలఁడు. అతనికి వెనుక సాహాయ్య ముండవలయును. ఈసహాయమునకై తక్కుoగల గుణవతీచంద్రమతులఁ గల్పించి వారికి గదసాంబులయం దనురాగ ముదయింపఁజేసినాఁడు. వారికడ వార్తాహారిణిగఁ జిలుక నొకదానిని సృష్టించినాఁడు. ఈచిలుకబుద్ధికిని హంసబుద్ధికిని వ్యత్యాస మెంతయుండునో యారెండుపాత్రములను బరిశీలించి చూచువారల కది విదితము గాకపోదు. చివరకు కార్యము సమగ్రముగ నిర్వహించుటకు శుచిముఖిసాహాయ్యమే యవసరమయినది.

ఈవ్యాపారమున కంతకును శుచిముఖియే సూత్రధారి. శుచిముఖికిఁ దెలియనివ్యాపారమేదియు నీవ్యూహమునందు లేదు. శుచిముఖి కథారంగమునఁ బ్రవేశింపఁగనే ఇంద్రోపేంద్రు లిరువురును వెనుక కొత్తిగిలిరి. ఈశుచిముఖి సర్వరహస్యములను బుక్కిటం బట్టి యెప్పటి కేది యెంత యవసరమో యంతియేగాని యెక్కుడుగ బయలుగాంచనీయక తనకార్యమును జక్కగ