ణములైనటుల యిందలి వజ్రనాభవినాశమునకు రాక్షసకులమున కంతకును వైరియైన శ్రీకృష్ణునికుమారునియందుఁ బ్రభావతికి అనురాగ ముదయించుటయే కారణమైనది. వీరిద్దఱును జెఱియొకపక్షమున నున్నవారు. వారియనురాగ మభివృద్ధి సేయుట కెంతనేర్పరి యనుసంధానకర్తయై యుండవలెనో యోచింపుఁడు. ఒకవైపున నూయి, ఒకవైపున గోయి, ఒకమూల రాజకార్యనిర్వహణము, ఒకమూల నాత్మరక్షణోపాయము, రహస్యపరిరక్షణము, ఇన్నియు జరుగుచుఁ గార్యానుసంధానము కావలయు. భారతయుద్ధమున రాయబారము నడపుటకు శ్రీకృష్ణుఁ డెంతసమర్థుఁడో, యీగూఢతంత్రనిర్వహణమునకు మనశుచిముఖి యంతనిర్వాహకురాలు. అట్టిపాత్రనిర్మాణము గావించుటలో స్వభావమున కించుకయైన వెలిగాకుండ తనయాశయమును తుదముట్టించిన మనగ్రంథకర్త మేధావిశేష మెంతయును ప్రశంసనీయము. ఈహంససందేశము ఈతనికి నలదమయంతు లిద్దఱకు ననుసంధానమును గలిగించిన హంసను బట్టి స్ఫురించియుండును; కాని ఆసందేశమునకును దీనికిని ఎంత వ్యత్యాస మున్నది? ఎంతటి రాజ్యతంత్రజ్ఞులకును నిట్టిసందేశము నడపుట దుర్ఘటము. ఒకచోట రాజకీయవ్యవహారములు చక్కఁబడవలయు. ఇంకొకచోట శృంగారవిషయము లనుసంధానము నొందవలయు. ఒకచోట భీష్మించి మాట్లాడవలయు. మఱియొక్కచోఁ దనయెత్తు తగ్గి ముచ్చటింపవలయు.
ఈకార్యమున కీయొక్కరాయబారము చాలినది కాదు. ప్రస్తుతకాలమునఁ బిట్టలను వేగు నడపుటకుఁ దయారుచేయుచున్నట్టును ఆపిట్టలు ఎక్కడకుఁబోయి ఎట్టు లాకార్యము నడుపుకొనవలయునో యట్లు రహస్యభంగము గాకుండ నిర్వ