అనుటయు నాపులోమజావల్లభునకు శుచిముఖీవల్లభుండను
మరాళతల్లజుం దుల్లసితవదనుం డగుచు నెదుర నిలిచి
దేవా యీవేళ కావజ్రనాభుండు ప్రాభవాభిమానంబునఁ
గన్నుఁగానమిఁ దన్నుఁ దా నెఱుంగకున్నవాఁడు నాకుఁ
జూడ నిప్పటికి కా దెప్పటికి నప్పరమతామసుం డింక నీవం
కకుం గదలిరా నెఱుంగఁడని తోఁచుచున్నయది యైనను
మానసంబున దేవర దేవకార్యం బేమియు నేమఱకుండు
నది యిదియంతయు నింతకుమున్ను వజ్రపురినుండి యేము
గొందఱము వచ్చితిమి గానఁ గానంబడిన యర్థంబు విన్న
వించితి నెంచి చూడం గించిదూనంబుగా వానిరాజ్య
సంపదయుఁ దుదకు వచ్చినది యిది మదీయజాయవలన వినం
బడియెఁ దద్విశేషంబును దానిచేత విన్నపంబు చేయించెదనని
తనచెలువం బిలిపించి బలరిపుం గనిపించి నీవు నాకు వినిపించిన
వజ్రనాభు రాజ్యావసానసామీప్యంబు స్వామికి నేమియుం
గొఱంత పెట్టక విన్నవింపు మనుటయు నాశుచిముఖి శత
మఖున కభిముఖియై యిట్లనియె.