విదితం బగుచుండు. ఈపాత్రమునందు సంస్తుతిపాత్ర మైనవిషయములు కవి యీక్రిందిపద్యమున నొప్పించియున్నవాఁడు.
| చ. | శుచిముఖి యండ్రు, దానిని వచోనిపుణత్వమునందు సత్కథా | |
ఇందలి ప్రతివిషయమునకును గ్రంథమునుండి పెక్కుదృష్టాంతములం జూపవచ్చు. ఇంత “కతరాజు” మఱియెక్కడను గనుపడఁబోఁడు. మంత్రి కుండవలసిన లక్షణములన్నియు నీశుచిముఖికడ నున్నవి. ఈపేరు నుడివినచోట మహామంత్రుల మనువారినామము నైన నుచ్చరింప ననువుగాదు. బృహస్పతివంటివానికి స్ఫురింపనివిజయోపాయములు దీనికి స్ఫురించినవి. ఇంద్రోపేంద్రులు విజయసాధనమున కీమార్గ ముపచరించునని మాటమాత్రము చెప్పిరిగాని అవి జరుగునుపాయములన్నియును మనశుచిముఖి తన మేధావిశేషమున నూహించి కార్యము నిర్వహించినది. దీనికిఁ గల సమయస్ఫురణకు మితి లేదు. కొన్నిచోట్ల వచనవక్రత. కొన్నియెడల మర్మరహిత మగుసంభాషణము. కొన్నిపట్టుల గంభీరభావములు. కొన్నిచోట్ల సూచ్యార్థసూచనలు, కొన్నిస్థలముల విరళీకృతవర్ణనావిశేషములు, కొన్నిసందర్భముల మూకీభావము. ఇన్ని చతురతావిశేషములు గల్గి యెక్కడ నెట్లు నటింపవలెనో అట్లు నటించి సకలకార్యములను సాధించి దిట్టతనంబున మెలంగినది. సరసత్వమున ప్రౌఢ “సకలకళలసడిసన్నలచదురులప్రోది బెఱిఁగినది.” ఎంతటివారినైన