Jump to content

పుట:ప్రభావతీప్రద్యుమ్నము (పింగళి సూరన).pdf/196

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


శా.

మందారద్రుమపుష్పవృష్టితతులున్ మంద్రస్ఫురద్దేవతా
దుందుభ్యారవసంప్రవర్తనలు నస్తోకాప్సరోనర్తనా
మందోల్లాసము దివ్యగాయకుల సన్మాధుర్యగానంబు నా
నందోత్సేకము నిచ్చె లోకులకు మింటం జాల దీపించుచున్.

218


వ.

అంత నచ్యుతుం డనాథత్వదైన్యదశాపన్ను లగుపౌరజనుల
ననేకవిధలాలనాచాతుర్యశీతలవచనామృతంబున నపగ
తాశేషశోకపరితాపుల నపూర్వసంభృతానందవిశేషులఁ
గావించి వజ్రనాభునిరాజ్యంబు సర్వంబును జతుర్భాగంబు
లుగా విభజించి తదాధిపత్యంబునకుఁ బ్రభావంతునిఁ జంద్ర
ప్రభుని గుణవంతునిఁ గీర్తిమంతునిం బట్టాభిషిక్తులం
గావించి కొడుకులం గోడండ్రనుం దమ్ముని మఱఁదలిని
నత్యంతవిభవంబు మెఱయం దోడ్కొనుచు ద్వారకానగ
రంబున కరుగుదెంచి దేవేంద్రునిం దదీయస్థానంబున కనిచి
సకలసామ్రాజ్యవిభవంబు లనుభవించుచు నిరంతరకరు
ణావలోకనంబుల భక్తజనంబుల నవలోకించుచు మహానం
దంబునం బొలుపొందుచుండె నప్పుడు.

219


క.

వావిరిఁ బ్రద్యుమ్నుండు ప్ర
భావతితో నిష్టకేళిపరిపూర్ణత నిం
పావహిలఁగ వర్తిల్లెను
శ్రీవరుఁ దమతండ్రిఁ దగ భజించుచు ఘనుఁ డై.

220


తే.

అఘహరణహరివంశకథాశ్రయంబు
నాత్మపుత్త్రగుణస్తవనాంకితంబు
నైనయీకావ్యమునకు మహాప్రసిద్ధి
నిచ్చుఁ గావుతఁ గరుణ లక్ష్మీశ్వరుండు.

221