Jump to content

పుట:ప్రభావతీప్రద్యుమ్నము (పింగళి సూరన).pdf/19

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రాగవల్లరి మంచిప్రౌఢ. ప్రభావతిమనంబు తనరహస్యంబులను దాఁచఁగలిగినది గాదు. శుచిముఖితోడ ప్రథమప్రసంగమున వారిరువురును ముచ్చటించిన ముచ్చటలనుబట్టి వారిరువురి ప్రౌఢతాప్రౌఢత లెట్టివో తెలిసికొనవచ్చును. వారి కదియె ప్రథమపరిచయము. శుచిముఖకిఁ జెప్పిన దెల్ల వారిద్దఱకును గలగిన వివాదాంశమునుగూర్చి యొక్కింత యీగడ. ఆయీగడ చెప్పినంతమాత్రమున నుబ్బిపోయి—

శా.

ఏమేమి యిఁక నొక్కమాటు చెపుమా యీ వున్నరూ పిట్లయో
యేమైనం గలదో విభేద మిటర మ్మీక్షింపు మింకన్ వచ
స్సామర్థ్యం బరయన్ మహాత్మ వని యస్మదుృద్ధికిం దోఁచె దా
హా మాభావముఁ గానలేవె మదిలో హంసీ భయం బేటికిన్.

అని దాని యానుపాను లరయకుండఁ దనహృదయమును జాఱవిడచెను. శుచిముఖనటనలఁ జూచి యామెను మహాత్మగాఁ దలఁచెను. రాగవల్లరి రాజపుత్రిక బేలవడుచున్నది యని కనిపెట్టి యది మఱుఁగుపడఁజేయఁ బ్రసంగమునకు దింపి, అయ్యది పన్నిదంబునకై యడిగిన ప్రశ్న మని మాటువఱుపఁ బ్రయత్నించెను.

వనవిహారము సేయుచు సహజముగ మృదుమధురంబులుగఁ బలుకుకోయిలపలుకులు తనప్రాణసఖికి విరహవేదనఁ గలిగించుచున్నవని యెంచి, కేవలనిర్దాక్షిణ్యచిత్తంబున నురు లొడ్డి పక్షుల బాధింపఁ జూచిన రాగవల్లరిహృదయమునకును, జిలుక యీయురులలోఁ జిక్కుటయె తడవుగ సంభ్రమంబున దిగ్గున లేచి దయాకులంబగు మనోవృత్తిని ఆపిట్ట కేమియు నపాయము రాకుండ నదల్చిన ప్రభావతీహృదయమునకును, దయాళుత్వమున నెంతయంతర మున్నదో వ్యక్త మగుచునె యున్నది; కాని