Jump to content

పుట:ప్రభావతీప్రద్యుమ్నము (పింగళి సూరన).pdf/186

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


మానిని తాను నోర్వఁ డతిమాత్రవియుక్తికి నిప్డ మాన్చునీ
కానెఱజాణయోగ్యకరుణామృతవృష్టి నయోగఖేదమున్.

164


వ.

అనిన రాగవల్లరికిఁ బ్రభావతి యి ట్లనియె.

165


సీ.

అట్టియసత్యంపుటలుకలు కల్పించు
            కొని వియోగవ్యథఁ గుందఁ జేసి
కాంతలయారూపు గనుఁగొను వేడ్కలు
            రాగుండెతోడి నిర్దయులయందు
సంభవించునొ కాని సత్కృపారాశి మ
            త్ప్రాణేశుఁ డేవినోదమున కైన
ననుఁ జిన్నపుచ్చి కన్గొనఁజాలఁ డొకనిమే
            షార్థమాత్రంబు నోయంబుజాక్షి


తే.

నేఁటిరాత్రి తెఱంగు నానేరమున జ
నించె నది యొక్కమాట కే నెమ్మనమున
నలిగి తేఱన యే నెన్నిప్రార్థనముల
దానిచే నెంత యెడసెనో ధవునిమనము.

166


చ.

అనవిని రాగవల్లరి సమంకురితస్మితకోమలావలో
కనముల నాప్రభావతిని గన్గొనునట్ల తదీశ్వరుం గనుం
గొని బళి గోపపుత్రరసికుండవు నీదగుధౌర్త్య మింతిపై
ఘనమసమానవీనసుధ గాంచి చవుల్ గొనుగోర్కి కోర్కియే.

167


క.

నా విని యోసితుటారి ద
యావారిధి నధిపుఁగూర్చి యనకు మొకటియున్
నావెఱ్ఱికినుక యింతకుఁ
దావల మని చెప్ప వినవె తరుణీ యనియెన్.

168