Jump to content

పుట:ప్రభావతీప్రద్యుమ్నము (పింగళి సూరన).pdf/176

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


తే.

ఆప్రభావతి కొంతసే పవ్విధమున
మానదుఃఖనిశ్చేష్టిత యైనవెనుక
నుస్సు రనుచును వేఁడినిట్టూర్పు నిగుడ
వగలఁ బొగులుచుఁ బొరలె మార్మొగము గాఁగ.

112


తే.

అరిగె శయ్యాంతరమునకు నంత లేచి
యతివరో యిది యేమి నాయందుఁ దప్పు
గలిగెనో యంచుఁ దోన రాఁ గడఁగువిభుని
నట్లు రాకుండ ఘనమైనయాన వెట్ట.

113


క.

ప్రద్యుమ్నుఁడు తా నటు చను
నుద్యోగము దక్కి యుస్సురుస్సు రనుచు నా
హృద్యతరాంగినియోగము
సద్యఃపరితాప మొసఁగ సందేహమునన్.

114


వ.

తనకుఁ గొంతసమీపంబున నొక్కపర్యంకంబున నవ్వలి
మొగంబుగా శయనించి యున్నయాప్రభావతికిఁ గర్ణగో
చరం బయ్యెడుపాటి పరిమితస్వరంబున ని ట్లనియె.

115


ఉ.

తామరసాక్షి నావలనఁ ద ప్పొక టెయ్యదియైనఁ గంటివో
నామదితాల్మి చూడఁగ మనంబునఁ గోరియొ యల్గి కూడినం
బ్రేమలు వింతయింపు సవరించునటంచునొ యల్కచొప్పుగా
కేమయిన న్నిమిత్త మొకయించుక కల్గెనొ లేచిపోవఁగన్.

116


క.

అనుటయు ఘనదుఃఖవశం
బున నొకయుత్తరము నీక పొలఁతుక నిట్టూ
ర్పు నిగిడ్చి యూరకుండిన
దనుజారిసుతుండు ప్రచలితం బగుమదితోన్.

117