Jump to content

పుట:ప్రభావతీప్రద్యుమ్నము (పింగళి సూరన).pdf/106

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


వ.

ఇవ్విధంబునం బెద్దయుం బ్రొద్దు విరహవేదనాదోధూయ
మానమానస యగుచు నుండి యంతట శుచిముఖిం జూచి
యి ట్లనియె.

106


సీ.

ఓహంసి నిన్ను నే నొక్కటి తుదమాట
            యడిగెద నీహృదయంబునందుఁ
గలయట్లు చెప్పుమీ కల్ల లాడిన నీకు
            నాతోడు సుమ్ము ప్రాణసఖి వీవు
తడయక ప్రద్యుమ్నుకడ కింక నొకమాఱు
            పోయి దుస్తర మైననాయవస్థ
చెప్పి చేరికఁ గొంత చేయవచ్చునొ రాదొ
            యీదురాశాపాశ మెందుఁ దెగని


తే.

బంధ మై ప్రాణముల వెలువడఁగ నీక
యాఁగి పెంచెడు మదనాగ్ని నహరహంబు
నీవు చని యవుగాములు నిశ్చయించి
యాశఁ దెగఁగోయు మదియ మత్ప్రాణరక్ష.

107


వ.

అనుటయు నాతరుణికిం గల హరితనయవరణానురాగం
బెవ్వారికి నవారణీయం బనియును నింక నియ్యాస చెడ
కుండ నిర్వహింపక తడసినం గడు నెడరు వాటిల్లఁ గార్యంబు
దప్పు ననియు నిశ్చయించి యంచ యి ట్లనియె.

108


చ.

మదితమిఁ జూడఁ గొన్ని వెడమాటలు పల్కితి నీవు నమ్ము మే
నిదె భవదీశుఁ దెత్తు నపుడేమి పరాకున మాఱు పల్కఁడో
సుదతి యెఱుంగఁగాని యిఁకఁ జూడుము తావకరూపవైభవా
భ్యుదయము విన్కలిన్ బ్రియము పూని యతండు విరాళిఁ గుందెడున్.

109