Jump to content

పుట:ప్రభావతీప్రద్యుమ్నము (పింగళి సూరన).pdf/10

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నారా? రాకపోకలకుఁ ద్రవ్వించుకొనినసొరంగము లట్లె యుండిన నుండనిండు. యుద్ధము తటస్థమైనప్పుడు పరాఙ్ముఖుఁడై పెడదారిం బోవుట వీరునకు లక్షణమా? ఈతఁ డెట్టివీరుఁడు? పిఱికికండ లేని బిరుదుమగఁడు. అట్టివాఁ డెంతటిప్రతివీరుఁ డడ్డము వచ్చినను జావనైనఁ జచ్చుం గాని వెన్నిచ్చి పఱచునా?

కవి యీతనివిక్రమము నిట్లు వర్ణించినాఁడు.—

చ.

భిదురధరుండు చక్రియును బెట్టుగ దీర్ఘవిచార మింత చే
యుదురఁట దైత్యుఁ డెంత బలియుండొ కదాయను కోచదారికి
ట్లుదుటున వానిఁ ద్రుంతు ననునొక్కని బంపిన నంటి చాలదే
యిది నెఱవైనబంటుతన మిట్టిది నీకె దగుం గుమారకా.


ఉ.

కయ్యపువేడ్క నేచుకొని క్రమ్మెడు త మ్మెదిరించి యేమియున్
డయ్యక కొంతసేపు పెనుఢాకను జేతులకాఁటినిల్చువాఁ
డెయ్యెడఁ బోటుబంటునకు నెంతయుఁ గౌతుకకారి గాఁడె నీ
నయ్య సురేంద్రుతోడి యని కాస యొనర్చుట యుక్త మెన్నఁగన్.


ఆ.

తమకుఁదామె పల్లడంబునఁ బనిలేని, కయ్యమునకుఁ జనరు గాని తగిన
దురములైన దివురుదురు తమయంతన, పిరికికండలేని బిరుదుమగలు.

అట్టిప్రద్యుమ్నుడు కన్నమున పోయినాఁడని చెప్పుటకన్న విరసమగువాక్య మొక్కటియుండునా? ప్రభావతి పతి-భక్తికిని, పితృభక్తికిని నిదానమయిన సచ్చరిత్ర. అట్టియాపె ఉభయులకును గయ్యము లేకుండఁ బోయెడు తెన్నునకయి యెంతయో యత్నించి కానక, మూలనున్న ఖడ్గమును దానె కొనితెచ్చి యిచ్చినది. ఈక్రిందిపద్యముం జూడుఁడు.