పుట:ప్రబంధసంబంధబంధనిబంధనగ్రంథము.pdf/6

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చామరబంధలక్షణము

చ.

తొలియడు గిందునం దరయఁ దుల్యము పద్భ్రమకత్వము న్నయం
ఘ్రులకు సగంబునంద యొడఁగూడును దీనికి బఙ్క్తు లాఱు పై
యలుఁగున ఖడ్గబంధమున కంఘ్రులు మూడును నాల్గుబంతులౌ
సలుపుదు రిట్టికీ లెఱిఁగి చామరబంధము చామరాదులన్.

2

ఖడ్గబంధలక్షణము

మ.

పిడికా దిందుది నాల్గునాల్గుదళముల్ పీఠాకృతిన్ నిల్పి యొ
క్కడుగం దల్గునఁ దచ్ఛిరోక్షరమె యాద్యంబంత్య మౌనట్లు పై
యడుగుల్ మూడును నాల్గుబంతులుగ వ్రాయన్ ఖడ్గబంధం బిదే
పుడమిన్ నేర్పరి గూర్పఁ జిత్రగతులం బొందున్ సుగంధ్యాదులన్.

3

పద్మబంధలక్షణము

మ.

నలసంజ్ఞల్ దళసంఖ్య నొప్ప దళవర్ణశ్రేణితోఁ గర్ణికా
తలవర్ణంబు లగించు చొప్పొకటి లేదా స్రగ్ధరాద్యంతది
గ్దళవరాళిప్రవేశనిర్గమనసాధారణ్య మొందన్ విది
గ్దళవర్ణంబులఁ గూడి యష్టదళసంజ్ఞం బద్మబంధం బగున్.

4

గ్రహచక్రబంధలక్షణము

మ.

అపసవ్యగ్రహచక్రమందు గ్రహనామైకైకముఖ్యాక్షరం
బుపయోగార్హముగాఁ గనంబడినటుల్ యోజించి పద్యాంఘ్రిగ
ర్భపరీతంబుగఁ జేసియో వసుదళాబ్జంబట్లు సంధించియో
యుపలబ్ధిన్ గ్రహచక్రబంధము బుధుఁ డూహించి కూర్పందగున్.

5

ఇదే యష్టదళపద్మబంధంబునకుఁ బక్షాంతరలక్షణం బగు.

నాగబంధలక్షణము

మ.

సరిగా నల్ నవకోష్ఠముల్ నెఱపి లో సందంశరీతింబర
స్పరరేఖల్ గదియించి పార్శ్వము లథోభాగంబుకోణంబులుం
బరివేష్ఠిపఁగఁ జుట్టి పుచ్ఛముఖముల్ ప్రాగ్రేఖలం దీర్చి స్ర
గ్ధరయో చంపకమాలయో యొగినిడంగా నాగబంధం బగున్.

6

పుష్పమాలికాబంధలక్షణము

ఉ.

సంధి నొకక్షరంబు నలుచక్కులఱేకుల నాల్గువర్ణముల్
సంధిలునట్లు స్రగ్ధరయొ చంపకమాలికయో మిధోగ్రసం
బంధము గల్గు తత్కుసుమమండలి లోనిడఁ బుష్పమాలికా
బంధ మగుం బ్రతిప్రసవవర్ణము లేడగుం గూడఁబల్కినన్

7

చక్రబంధలక్షణము

మ.

పయిపైఁగాఁ బదిచుట్లు నాఱుదళముల్ ప్రాగ్రేఖలం దీర్చి స్వా
హ్వయపత్యాహ్వయముఖ్యచిహ్నములు గన్పట్టంగఁ బాదత్రయా
శ్రయరేఖాంత్యపదాశ్రయాదివృతిగా శార్దూలవిక్రీడితా
హ్వయవృత్తంబు యథాక్రమంబుగ లిఖింపం జక్రబంధం బగున్

8

సర్వతోభద్రబంధలక్షణము

మ.

క్రమరీతిం జతురంగచక్రమున నర్థశ్రేణుల దర్థప
ద్భ్రమకంబై ప్రథమాంఘ్రివర్ణము లథఃపాదాదులం దుల్యసం
ఖ్యముగాఁ గల్గినదై సగంబు తలక్రిందై సర్వతోభద్రబం
ధమగుం బొందిక దీని కెన్మిదవచందం బెన్నచందంబులన్

9