పుట:ప్రబంధసంబంధబంధనిబంధనగ్రంథము.pdf/16

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నాగాభరణబంధలక్షణము

ఉ.

అంగజభంగలింగమున నాదిమ ముంచి తదాదిగా భుజం
గాంగమునందుఁ బ్రాక్పద మనంతరపాదము లుత్తమాంగప
ఙ్క్తిం గవి యిచ్చవచ్చినగతిన్ శకలంబులుగా లిఖించి యి
బ్భంగి భుజంగమాభరణబంధ మొనర్చుఁ దనర్చు నేర్పునన్

79

బిల్వదళబంధలక్షణము

ఉ.

మధ్యదళంబునందుఁ బ్రథమంబగు నంఘ్రియుఁ బ్రక్కఱేకులన్
మధ్యపదద్వయంబునుఁ జమత్కృతిమించ లిఖించి వృంతమె
దధ్యుషితంబుగా నిడిన నంతిమమాదిమందుఁ జేర్చినన్
బాధ్యముగాదు బిల్వదబంధము సంధిచతుష్పథంబుగాన్

80

పంచకోణ-షట్కోణ-యంత్రబంధలక్షణములు

చ.

అలయకు కోనులైదయిన నాఱయినం గలయంత్రరేఖలన్
వలయమునం దమర్చి ముఖివర్ణముఁ గర్ణికయందుఁ జేర్చి త
ద్దళముల నొక్కటొక్కటిగఁ దక్కటివ్రాలిడ నొక్కవృత్తమై
భళిభళి కోణసంజ్ఞ నది బంధ మగున్ నడివ్రాయిసంధిగాన్

81

గురుసుదర్శనబంధలక్షణము

ఉ.

ద్వాదశపత్రముల్ గలుగువర్తులరేఖ లిఖించి వృత్తపుం
బాదచతుష్కభిత్తములు వ్రాయఁగఁ గర్ణికనున్న వర్ణమే
కాదు తతాదివర్ణము నొకండయి కన్పడుచుండు దేనిలోఁ
దాదృశబంధమే గురుసుదర్శనబంధ మగు న్వసుంధరన్

82

మహాసుదర్శనబంధలక్షణము

శా.

పద్యద్వాదశఖండమండలమునం బ్రత్యాదివర్ణద్వయం
బాద్యంతాక్షరయుగ్మకం బభిమతాయత్తంబులై వృత్తరే
ఖోద్యద్ద్వాదశఖండమండలమునం దొప్పారఁ జొప్పింప ని
ష్పాద్యంబై పొదలున్ సుదర్శనమహాబంధంబు గ్రంథంబులన్

83

వరదముద్రాభయముద్రాబంధద్వంద్వలక్షణము

మ.

కరిమధ్యాక్షర మాద్యమంత్యముఁగ శ్లోకంబంగుళీపంచక
స్ఫురితంబౌగతి ఖండఖండములుగాఁ బూర్వాంఘ్రులన్ వ్రాయఁగాఁ
జరమంబాద్యమున్ విలోమగతిచే సంధిల్లుఁ బ్రత్యేకము
న్వరదానాభయదానముద్రలను బంధద్వయ మి ట్లేర్పడున్

84

కిరీటబంధలక్షణము

మ.

క్రమతన్ బంతులు దొంతులై తనర నేకద్విత్రిషడ్గేహముల్
కమనీయాకృతిఁ జేర్చి చిత్రగతి నగ్రంబాదిగా మూడుపా
దములం జేర్పఁగ నాద్యవేద్యమగునంత్యం బిట్లు గూర్పం గిరీ
టమహాబంధ మగుం గవీష్టము బలిష్టం బన్యథా సృష్టికిన్

85

దర్దురతాళబంధలక్షణము

మ.

ముఖకీలాజగ మూలకీలములలో ముఖ్యాంత్యపాదంబులున్
శిఖరాభ్యంతరతోరణాకృతిగఁ దృచ్ఛంగోర్థ్వతుండాకృతిన్
లిఖియింపందగు మధ్యపాదయుగ మీలీలం బ్రకల్పించినన్
సుఖవేద్యంబయి తాళబంధమన మించున్ దర్దురాకారమై

86