పుట:ప్రబంధసంబంధబంధనిబంధనగ్రంథము.pdf/15

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శకటబంధలక్షణము

చ.

నిడుపుగ రెండుదండెలుగ నిల్పినరేకల కడ్డురేకు లా
ఱిడి నడిపట్ల నైదునయిదిండ్లుగ నుండలు రెం డమర్చి రెం
డడుగులనుండలందు నడియంజలరేకులయందు సంధిచొ
ప్పడ నడపించుచున్ శకటబంధముగాఁ బ్రకటింత్రు సత్కవుల్

71

సూక్ష్మగవాక్షబంధలక్షణము

చ.

అల చదరపుంగదుల నంఘ్రలు నాల్గును శృంఖలాకలన్
నలుదెసలం దిడంగ నడినాల్గులిపుల్ తుదలున్ మొదళ్ళుఁగాఁ
దలరం దొడంగి క్రమ్మఱఁ బదమ్ములు నాల్గుఁ గడంగి తుండతుం
డలుగ నడంగఁ దానది బెడంగగు సూక్ష్మగవాక్షబంధమై

72

చిత్రవితానబంధలక్షణము

చ.

చదురున నెన్మిదెన్ముదులచక్రపుటిండ్లకు నాల్గుచక్కులం
బదములు నాల్గుజాలరులభాతి లిఖించి తదంతరాళపుం
గదులఁ దదాదికోణములఁ గ్రమ్మఱఁ బ్రాక్చరమాంఘ్రు లాదులం
ట దుముకఁగూర్చి సత్కవివితానము చిత్రవితానబంధమున్

73

అల్పాష్టాపదబంధలక్షణము

శా.

కల్పింపంబడినట్టి నెత్తపలకన్ గర్భాదిగా నిండ్లలో
నిల్పంగాఁ దగు నర్ధపాదములుగా నిండైనపద్యంబు ని
ట్లల్పాయాసమనల్పకల్పనమునై యష్టాపదప్రాప్తిచే
నల్పాష్టాపదబంధ మేర్చుఁ జతురుం డష్టాపదప్రాప్తికిన్

74

ఉత్తరదేశగ్రహచక్రబంధలక్షణము

మ.

సరిగా నల్చదరంపుఁజక్రము విదిక్చక్రంబు తన్మధ్యమం
దురుచక్రంబున మూలమూలలకు రెండుద్ధారముల్ గీఱి త
చ్చరణద్వాదశకంబునం జరణముల్ సంధిల్ల హత్తింప ను
త్తరదేశగ్రహచక్రబంధమగుఁ బద్యంబండె వేద్యం బగున్

75

సవ్యగ్రహచక్రబంధలక్షణము

ఉ.

జాగ్రదిరాసమగ్రులయి చాలుగ నాలుగు నాల్గు నిల్వుగా
నగ్రియులెన్న మధ్యములయందు నొకొక్కఁడు నైనరేఖలన్
విగ్రహ మేర్పరించి పదవిన్యసనం బొనరింతురేని స
వ్యగ్రహచక్రబంధ మగు ద్వాదశరాశినివేద్యపద్యమై

76

నందికేశ్వరబంధలక్షణము

ఉ.

పుంగవరీతి గీఁత లిడి మోరమొదల్కొని తోఁకదాఁక సొం
పుంగ వనంపుఁబెంపుఁ బెనుపుంగవదాఁటులనీటు లబ్బురం
పుంగవణింపులాదిగల భూరిచమత్కృతు లున్నతిన్ సుధీ
పుంగపు లెన్న నిట్లు సలుపుం గవి సుందరనంధిబంధమున్

77

కేయూరబంధలక్షణము

మ.

క్రమతన్ నాయకరత్నవర్ణముమొదల్గాఁ జుట్టు నున్నట్టి శ
స్తమణిస్థానములందుఁ బ్రాక్చరమపాదంబుల్ ప్రవేష్టింప మ
ధ్యమవర్ణాదిగ మధ్యపార్శ్వముల మధ్యాంఘ్రుల్ ప్రతిష్టింపఁ జ
క్రిమహేశాదిసురార్హణార్హ మగుచుం గేయూరబంధం బగున్

78