పుట:ప్రబంధసంబంధబంధనిబంధనగ్రంథము.pdf/13

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నిశ్రేణికాబంధలక్షణము

శా.

ఏకాద్యంకము లక్షరాంకములుగా నెక్కించియో యిష్టవ
ర్ణాకీర్ణంబుల గాఁగఁ గూరిచియొ సీసాద్యర్ధపాదాళులం
దేకీభావము నొందఁజేసి యధిరోహిణ్యాకృతిం బండితా
నీకం బెన్నఁగఁ జెప్ప నొప్పు నదియే నిశ్రేణికాబంధమై

57

డోలికాబంధలక్షణము

మ.

రహిమై నుయ్యెలతొట్టెపట్టెకొన లారంభంబు నంతంబుఁగా
ముహురాశ్చర్యకరప్లుతిం బ్రథమ మొప్పుం దత్పదాద్యంతవ
ర్ణహితాద్యంతములై గుణంబులగుఁ దన్మధ్యాంఘ్రు లాద్యాంఘ్రియై
విహరించుం జరమాంఘ్రి గూర్తు రిటు లుర్విన్ డోలికాబంధమున్

58

వీణాబంధలక్షణము

మ.

మృదుభేకప్లుతిఁ బర్వఁ బూర్వపదమున్ మెట్లున్నచో వ్రాసి త
త్పదమూర్ధాక్షర మాద్యమంత్యముగ సాఁబాలేగియో సాగియో
మొదలంటం బొదిగొంచు రా నడిపదంబుల్ వ్రాయఁ బూర్వాంఘ్రియం
ద దువాళించుఁ దురీయపాద మిది వీణాబంధలక్ష్మం బగున్

59

రుద్రవీణాబంధలక్షణము

శా.

సేబా సంచుఁ గవుల్ నుతించుకరణిం జిత్రప్లుతిన్ దండెపై
తాఁ బూర్వాంఘ్రి లిఖింపఁగాఁ జరమపాదం బందులో డిందు నా
లాబుద్వంద్వమునందు మధ్యపదము ల్సంధిల్లెడున్ రుద్రవీ
ణాబంధంబున రెండుపాంత్యలిపులు న్మధ్యాంఘ్రులన్ నిల్పఁగాన్

60

కులాలచక్రబంధలక్షణము

ఉ.

కుమ్మరసారెచందమున గుండ్రనిరేఖలు నడ్డుగీఁట్లు న
బ్రమ్ముగ గీఁసి చిత్రగతిఁ బ్రాక్పద మంతరమందు మధ్యపా
దమ్ములు చుట్టునుం దగువిధమ్మున వ్రాయఁ గులాలచక్రబం
ధమ్మగుఁ దుర్యమాదిమపదమ్మున నేకత నొందుఁ గ్రిందుగాన్

61

లఘుసుదర్శనబంధలక్షణము

ఉ.

నాలుగుపత్రసంధులను నాలుగుపాళ్ళుగ నాదిపాదమున్
నాలుగుపెద్దరేకులను నాలుగుపాళ్ళుగ మధ్యపాదముల్
గ్రాలఁగ నంత్య మాద్యమయి కన్పడు నిన్ను మధ్యవర్ణముం
దౌలు నిదేకదా లఘుసుదర్శనబంధ మటండ్రు పండితుల్

62

వీటికాబంధలక్షణము

శా.

ఆమూలాగ్రముగా సిరాగ్రధితమౌ నాద్యాంఘ్రి మూర్ధాదిగా
ధీమంతుల్ గొనియాడ మధ్యపదముల్ తిర్యక్సిరాసంధులన్
ద్వైముఖ్యమ్మునఁ గ్రుమ్మరుం జరమపాదం బాదిపాదంబునం
దామగ్నం బగుఁ గూర్తు రిట్లు కృతికర్తల్ వీటికాబంధమున్

63

దీనికే లక్షణాంతరము

శా.

ముక్కోణంబుగ నాగవల్లిదళముల్ పూగాదియోగంబునన్
నెక్కోఁజేసి లవంగసంగతముగా నిర్మించి ప్రాక్తుర్యముల్
చక్కంబెట్టి తదాదిగా నడిమియంజల్ చుట్టు రానిల్పఁగా
ముక్కంటిం గొలువంగ నూడిగ మగుం బో వీటికాబంధమై