పుట:ప్రపంచ చరిత్ర - మొదటి భాగము.pdf/88

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

86

ప్రపంచ చరిత్ర


కాశీపట్టణచ్ఛాయలో బుద్ధుడు తన బోధనలను ప్రారంభించెను. మంచిగా జీవించుటకు మార్గమాతడు చూపెను. దేవుళ్ళకిచ్చు బలుల నాతడు ఖండించెను. దానికి బదులు మనము క్రోధము, ద్వేషము, మత్సరము, వక్రాలోచనలు వీనిని బలిపెట్టవలెనని బోధించెను.

బుద్దుడు పుట్టినప్పుడు వేదమతము ఇండియాలో వ్యాపించియుండెను. అప్పటికే అదిమారి ఉన్నత స్థానమునుండి జారిపోయెను. బ్రాహ్మణ పురోహితులు వ్రతములు, పూజలు, మూఢవిశ్వాసము ప్రవేశ పెట్టిరి. పూజలధికమైనకొలది పురోహితులు బాగుపడుచుండిరి. వర్ణ ధర్మములు కాఠిన్యము వహించెను. శకునములు, వశీకరణ మంత్రములు, మంత్ర ప్రయోగములు, బూటకపు చికిత్సలుచూచి సామాన్యప్రజలు భయభ్రాంతులగుచుండరి. పురోహితులీపద్దతుల నవలంబించి ప్రజలను తమ వశములో నుంచుకొని క్షత్రియ ప్రభువుల యధికారమును ధిక్కరించిరి. అందుచే క్షత్రియులకును, బ్రాహ్మణులకును స్పర్ధ ఏర్పడెను. బుద్ధుడు సంస్కర్తగా బయలుదేరి పలుకుబడి సంపాదించెను. అతడు పురోహితుల నిరంకుశత్వమును ఖండించెను. వేదమతమున ప్రవేశించిన దోషముల నన్నింటిని ఖండించెను. ప్రజలు మంచిగా జీవించవలెననియు, సత్కార్యములు చేయుచుండవలెననియు, పూజాదులు చేయరాదనియు అతడు నొక్కి చెప్పెను. బౌద్ధసంఘము నాతడేర్పరచెను. బుద్ధుని బోధల ననుసరించు భిక్షువుల యొక్కయు, సన్యాసినులయొక్కయు సంఘమే యిది.

కొంతకాలమువరకు బౌద్దమతము ఇండియాలో అంతగావ్యాపించ లేదు. తరువాత అదియెట్లు వ్యాపించినదో, పిదప నొక ప్రత్యేకమఠముగానుండక నామమాత్రావశిష్టమైనదో ముందు ముందు చూతము. సింహళము మొదలు చీనావరకు దూరదేశములలో అది ఉచ్చస్థితినందగా జన్మదేశమగు ఇండియాలో అది బ్రాహ్మణమతమున (హిందూమతము) నంతర్భూత మయ్యెను. బ్రాహ్మణమతముపై తన ప్రభావమును చూపి మూఢవిశ్వాసమును, కర్మకాండనుకొంతవరకు దానినుండి తొలగించెను.