పుట:ప్రపంచ చరిత్ర - మొదటి భాగము.pdf/79

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ధన మెచ్చటికి పోవును?

77


వేటాడుచుండిరి. రోజుకు రోజు పళ్లు, గింజలు సంపాదించుకొను చుండిరి. తిండికై వెదకుకొనుచు ఒక చోటినుండి ఇంకొక చోటికి పోవుచుండిరి. క్రమక్రమముగా వారు తెగలుగా తయారైరి. ఇవి నిజముగా పెద్ద కుటుంబములే. తెగలోని మనుష్యులు కలిసి జీవించుచు, కలిసి వేటాడుచు నుండువారు. ఒక్కరట్లు చేయుటకన్న తెగలోనివారు కలిసి చేయుట క్షేమకరము. అప్పు డొక గొప్ప మార్పు వచ్చినది. అది వ్యవసాయమును కనిపెట్టుట. నిరంతరము వేటాడుటకన్న వ్యవసాయ పద్ధతుల ననుసరించి భూమిని దున్ని పంటలు పండిచుట సులభమని వారు గ్రహించిరి. దున్నుట, విత్తుట, నూర్చుట అన్నప్పుడు భూమి వద్ద నివసించుట యగును. ఇదివరలోవలె వారు పర్యటన చేయ వీలులేదు. పొలములను కనిపెట్టుకొని ఒక్కచోట వా రుండవలెను. ఈ విధముగా పల్లెలు, పట్టణములు లేచినవి.

వ్యవసాయము ఇతరమార్పులనుకూడ ప్రవేశ పెట్టినది. భూములు పండగా వచ్చిన ఆహారపదార్థములు ఒక్కమారు వినియోగించుటకు కావలసినదానికన్న అధికముగా నుండెను. పెచ్చుగానున్న పదార్దములు నిలువచేయవలసియుండెను. వేటాడు దినములలోకన్న నేడు జీవితమున చిక్కులు ఎక్కువగా నుండెను. కొందరు పొలములలోను, ఇతర స్థలములందును పనిచేయుచుండిరి. మరికొందరు పై పెత్తనము, కలియ గట్టుకొనివచ్చుట _ అను పనులను చేయుచుండిరి. పెత్తనదార్లు, కలియ గట్టుకు వచ్చువారు క్రమక్రమముగా బలవంతులైరి. వారే కులపెద్దలు, అధికారులు, రాజులు ప్రభువులు అయిరి. అధికార మున్నదికాబట్టి వారు పెచ్చుగా పండిన పంటలో చాలభాగము తమకొరకు అట్టే పెట్టుకొనుచుండిరి. ఆ విధముగా వారానాటికానాడు భాగ్యవంతులైరి. పొలములలో పనిచేయువారికి పొట్ట నింపుకొనుటకు చాలినంత మాత్రము మిగులుచుండెను. కొంతకాలమైనపిమ్మట ఈ పెత్తనదారులును, కలియ గట్టుకొనివచ్చువారును తమపనులు తాము, బద్దకమువల్ల నైతేనేమి,