పుట:ప్రపంచ చరిత్ర - మొదటి భాగము.pdf/75

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రాచీనకాలము పిలుచు పిలుపు

73


పెరిగినదో, అందొక్క తుదిసామ్రాజ్యము, డరయస్‌క్రింద ఇండియాలోని సింధునదివరకు ఎట్లు వ్యాపించినదో సంక్షేపముగా తెలిసికొంటిమి. పాలస్తీనాలో హీబ్రూలు అల్పసంఖ్యాకు లైనప్పటికిని, ప్రపంచమునం దొకమూల నివసించుచున్న వారైనప్పటికిని, ఎట్లు ప్రపంచదృష్టి నాకర్షించిరో కొద్దిగా చూచితిమి. అంతకన్న గొప్పరాజుల పేళ్లు నామమాత్రా వశిష్టములైనప్పటికిని, బై బిలులో వారి పేళ్ళుండబట్టి వారి రాజులైన డేవిడ్, సామన్‌ల పేళ్ళు నేటివరకు ఎట్లు నిలిచియున్నవో చూచితిమి. గ్రీసులో, ఆర్యుల క్రొత్తనాగరీకత, క్నోస్సోస్‌యొక్క ప్రాచీననాగరికతా శిధిలముపై ఎట్లు లేచి వృద్ధిచెందినదో గమనించితిమి. నగరరాష్ట్రములు వెలసినవి. గ్రీకుల వలసలు మధ్యధరాతీరప్రాంతముల లేచినవి. ఉచ్చస్థితి ననుభవింపనున్న రోమును, దాని ప్రబలప్రతిస్పర్థి కార్తేజియును అప్పుడప్పుడే చరిత్రాకాశమున ఉదయించుచున్నవి.

పై విషయములన్నియు దీజ్మాత్రముగా చూచితిమి. ఎత్తుకొనని దేశములను గురించి కూడ కొన్ని విషయములు నీకు నేను చెప్పియుండ వలసినదే - ఉత్తర యూరోపులోని దేశములు, ఆసియా కాగ్నేయముగా నున్నదేశములు. ఆ తొలిరోజులలోనే దక్షిణఇండియానుండి హిందూ నావికులు బంగాళాఖాతమును దాటి మలయా ద్వీపకల్పమునకును, దానికి దక్షిణముగానుండు ద్వీపములకును పోయియుండిరి. కాని ఎచ్చటనో ఒకచోట హద్దు పెట్టుకొనవలెను ; లేకున్న ముందుకుసాగి పోజాలము.

మనము ముచ్చటించుకొన్న దేశములు పురాతన ప్రపంచమునకు సంబంధించినవి. ఆ రోజులలో దూరదేశములకు రాకపోక లెక్కువగా లేవని నీవు జ్ఞాపకముంచుకోవలెను. సాహసికులగు నావికులు సముద్రములపై ప్రయాణములు సాగించిరి. కొందరు వర్తకమునకు, ఇంకను ఇతరకార్యములకు భూమిమీద దూరప్రయాణములు చేసిరి. కాని ప్రమాదము లధికముగా నుండుటచే ఇట్టి ప్రయాణములు అరుదుగా జరుగు చుండెను. భూగోళ శాస్త్రజ్ఞాన మాకాలమున మిక్కిలి కొంచెము.