పుట:ప్రపంచ చరిత్ర - మొదటి భాగము.pdf/68

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది



11

వేయి సంవత్సరముల చీనా చరిత్ర

జనవరి 16, 1931

బయటి ప్రపంచమునుండి వార్తలు వచ్చినవి. మనోవ్యాకులత్వము దుఃఖము కలిగించు వార్తలు. అయినను గర్వము, సంతోషము పొందదగిన వార్తలు. షోలాపూరు ప్రజల దుర్భరావస్థ మాకు వినవచ్చినది. ఈవార్త విన్నప్పుడే దేశము నలుమూలల జరిగిన సంగతులు కూడ మాకు కొద్దిగా తెలియవచ్చినవి. మన యువకులు తమ ప్రాణము లర్పించుచున్న సమయమున, వేలకొద్ది మన స్త్రీ పురుషులు క్రూరమగు లాఠీ దెబ్బలకు గురియగుచున్న సమయమున, ఇచ్చట చేతులు కట్టుకొని కూర్చుండుట కష్టముగా నున్నది. ఇది మనకు మంచి తరిఫీదు. మనలో ప్రతియొక్క స్త్రీకిని, పురుషునకును తమతమ సామర్థ్యములు పరీక్షించుకొనుటకు తగిన తరుణములు తటస్థించునని యూహించెదను. బాధల నెదుర్కొనుటకు మనవారు ఎట్లు సాహసముతో ముందంజవేయుచున్నారో తలచుకొనినప్పుడును. శత్రువు ఉపయోగించు ప్రతి క్రొత్త సాధనము, కొట్టు ప్రతిదెబ్బ ఎట్లు వారిని బలయుతులనుగాను, ప్రతిఘటించు పట్టుదల గలవారినిగాను చేయుచున్నవో తలచుకొనినప్పుడును మన హృదయము లుప్పొంగు చున్నవి.

ప్రస్తుత వార్తలు మనస్సు నాక్రమించినప్పుడు ఇతర విషయములనుగూర్చి యాలోచించుట కష్టము. కాని వట్టి ఊహలవలన ప్రయోజనములేదు. నికరముగా పనిచేయవలసి వచ్చినప్పుడు మన మనస్సులను మనము నిగ్రహించుకొనవలెను. కాన మనము ప్రాత కాలమునకు పోవుదము. కొంతసేపు మన ప్రస్తుత కష్టములకు దూరముగా ఉందము.