పుట:ప్రపంచ చరిత్ర - మొదటి భాగము.pdf/67

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రాచీన హిందూస్థానమున గ్రామ పంచాయతులు

65


ఏవనగా - దక్షిణ బీహారులోని మగధరాజ్యము; ఉత్తర బీహారులోని విదేహరాజ్యము : కాశీరాజ్యము : అయోధ్య రాజధానిగా గల కోసలరాజ్యము (అయోధ్యనే నేడు ఫైజాబాదు అందురు): గంగా యమునలకు మధ్యనున్న పాంచాలదేశములు. పాంచాల రాజ్యములందలి ప్రఛాననగరములు మధుర, కన్యకుబ్జము. ఇవి తరువాతికాలపు చరిత్రలోకూడ ప్రసిద్ధివహించినవి. ఈ రెండు నగరములును ఇప్పుడున్నవి. కన్యకుబ్జమునకు నేటి పేరు కనోజ్. ఇది కాన్పూరు సమీపమున నున్నది. ఆ రోజులలో ఉజ్జయినికూడ ఉండెను. నేడది గ్వాలియరు సంస్థానములో చిన్న పట్టణము.

పాటలీపుత్రము (పాట్నా)నకు సమీపమున వైశాలి యను నగర ముండును. ప్రాచీన హిందూదేశచరిత్రలో ప్రసిద్దిజెందిన లిచ్ఛపులతెగకు చెందిన ముఖ్యపట్టణ మిది. వారి రాజ్యము ప్రజాప్రభుత్వ రాజ్యము. ప్రసిద్ధ పురుషుల సంఘము ఈ రాజ్యమును పాలించెను. ఈ సభకు ఎన్నుకొన్న అధ్యక్షుడుండెను. అతనిని నాయకు డనువారు.

కాలము గడువగా పెద్దపట్టణములు, నగరములు పెరుగజొచ్చెను. వర్తకము వృద్ధియయ్యెను. శిల్పవిద్యలు, వృత్తులు వికాసముచెందెను, నగరములు గొప్ప వర్తక కేంద్రములయ్యెను. బ్రాహ్మణులు శిష్యులతో నివసించు వనవాటికలలోని ఆశ్రమములు గొప్ప విశ్వవిద్యాలయ పట్టణములైనవి. ఈ విద్యాసంస్థలలో అప్పటి శాస్త్రము లన్నియు బోధించెడి వారు బ్రాహ్మణులు. ధనుర్విద్యను సైతము బోధించెడివారు. జ్ఞాపక మున్నదా. మహాభారతకథలోని పాండవుల గురువు ద్రోణాచార్యుడని. ఇతడు బ్రాహ్మణుడు. ఇతర శాస్త్రములతోపాటు ఈతడు రణవిద్యను కూడ శిష్యులకు బోధించెను.