పుట:ప్రపంచ చరిత్ర - మొదటి భాగము.pdf/60

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

58

ప్రపంచ చరిత్ర


నాగరికత కలిగియుండిరి. వారి భాషలు ఆర్యుల సంస్కృతమునుండి పుట్టినవికావు. అవి పురాతనభాషలు. వానికి చక్కని సారస్వతములు కలవు. తమిళము, తెలుగు, మళయాళము, కన్నడము - ఇవి యాభాషలు. ఈ భాషలన్నియు దక్షిణఇండియాలో నేడుకూడ వర్దమానమగుచున్నవి. నీకు తెలియు ననుకొందును - జాతీయ మహాసభ (కాంగ్రెసు), బ్రిటిషు దొరతనమువలెగాక, ఇండియాను భాషలనుబట్టి రాష్ట్రములుగా విభజించినది. ఇది నేడున్న పద్దతికన్న ఉత్తమపద్ధతి. ఎందుకనగా సాధారణముగా సమాన ఆచార వ్యవహారములు గలిగి, ఒకే భాష మాటాడు ఒకేమాదిరి ప్రజలు ఒక రాష్ట్రములో నుందురు. దక్షిణముననున్న కాంగ్రెసు రాష్ట్రము లేవనగా - ఆంధ్రదేశము, లేదా ఆంధ్ర రాష్ట్రము : ఇది చెన్నపట్టణమున కుత్తరమున నున్నది. ఇచ్చట మాటాలు భాష తెలుగుభాష, తమిళనాడు, లేదా తమిళరాష్ట్రము : ఇచ్చట ఆరవము మాటాడుదురు. కర్ణాటకము : ఇది బొంబాయికి దక్షిణముగా నున్నది. ఇచ్చట మాటాడు భాష కన్నడము, లేదా కర్ణాటకము. కేళము : ఇది కొంచే మెచ్చుతక్కువగా మలబారుదేశము. ఇచ్చటి భాష మళయాళము. ముందుముందు భాషా ప్రయుక్త రాష్ట్రములు రాష్ట్రభాషల యభివృద్ధికొర కెక్కువగా పాటుపడగలవనుటకు సందేహములేదు.

ఇండియాలోని భాషలనుగురించి మరికొంతచెప్పెదను, యూరోపులోను, ఇంకను ఇతర దేశములలోను కొందరు ఇండియాలో వందలకొలది భాష లున్నవని భ్రమపడుదురు. ఇది అసందర్భము. ఇట్లు చెప్పెడువాడు తన యజ్ఞానమును ప్రకటించుకొనుచున్నాడు. ఇండియా వంటి పెద్దదేశములో అనేక ప్రాంతీయ భాషలున్నవి-ఒకే భాష వేర్వేరు ప్రాంతములందు భిన్నరూపము ధరించుచుండును. కొండజాతులవా రెందరో యున్నారు. ప్రత్యేక భాషలుగల సంఘములు కొన్ని యున్నవి. మొత్తము ఇండియానుగురించి మాటాడుచున్నప్పు డివి